సింగరేణి అధికారుల ఆందోళన ఉధృతం

by Jakkula.Mamatha |

సింగరేణి అధికారుల సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ అధికారుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం ఐదో రోజుకు చేరుకున్నాయి.

సింగరేణి అధికారుల ఆందోళన ఉధృతం
X

దిశ, కొత్తగూడెం సింగరేణి: సింగరేణి అధికారుల సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ అధికారుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం ఐదో రోజుకు చేరుకున్నాయి. మహిళా, పురుష అధికారులు పెద్ద సంఖ్యలో దీక్షల్లో పాల్గొని యాజమాన్యం తక్షణమే స్పందించాలని కోరారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఓ మహిళా అధికారిణి భావోద్వేగానికి గురయ్యారు. "మేము అధికారులు అందరం కలిసి రోడ్డు పక్కన నిలబడి నిరాహార దీక్ష చేయాల్సి రావడం చాలా బాధాకరం. ముఖ్యంగా మహిళలమైన మాకు ఇది మరింత ఇబ్బందికరమైన పరిస్థితి. అయినప్పటికీ మా న్యాయమైన హక్కుల కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

2017 వేతన సవరణ ఒప్పందాన్ని సరిదిద్దుతూ అమలులోకి వచ్చిన సీఐఎల్ పే అప్‌గ్రేడేషన్ను ఇప్పటికీ సింగరేణిలో అమలు చేయకపోవడం, అధికారులకు రావాల్సిన పీఆర్‌పీ (పెర్ఫార్మన్స్ రిలేటెడ్ పే), ఇతర అలవెన్సులకు సంబంధించిన రెండేళ్ల బకాయిలను చెల్లించడంలో జాప్యం చేయడం వల్ల అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. "లేడీస్, జెంట్స్ అనే తేడా లేకుండా అందరం ఒకే వేదికపై నిరాహార దీక్షలో పాల్గొంటున్నాం. యాజమాన్యం వెంటనే చర్చలకు వచ్చి మా సమస్యలను పరిష్కరించాలి" అని అధికారులు విజ్ఞప్తి చేశారు. సింగరేణి అధికారుల సంఘం నాయకులు మాట్లాడుతూ, పెండింగ్‌లో ఉన్న వేతన, భత్యాల అంశాలపై యాజమాన్యం సానుకూల నిర్ణయం తీసుకునే వరకు ఆందోళనలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారంలో జాప్యం చేయకుండా అధికారులు, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే అమలు చేయాలని వారు కోరారు.

Next Story