- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
' కొత్త రైలు కట్ట నిర్మాణ డిజైన్ మార్చాలి '
మోటమర్రి వద్ద రైల్వే అధికారులు సర్వే చేసి రూపొందించిన రైలు కట్ట నిర్మాణ డిజైన్‌ను మార్చాలని గ్రామానికి చెందిన పదిమంది బాధిత రైతులు గురువారం తహసీల్దార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

దిశ, బోనకల్ : మోటమర్రి వద్ద రైల్వే అధికారులు సర్వే చేసి రూపొందించిన రైలు కట్ట నిర్మాణ డిజైన్‌ను మార్చాలని గ్రామానికి చెందిన పదిమంది బాధిత రైతులు గురువారం తహసీల్దార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. రైతులు తెలిపిన వివరాల ప్రకారం మొదట రూపొందించిన డిజైన్ అమలైతే రైతులకు చెందిన 25 ఎకరాల భూమి మాత్రమే రైల్వే ప్రాజెక్టు కిందకు వెళ్లేదని తెలిపారు. అయితే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు రైల్వే అధికారులకు తప్పుడు సమాచారం ఇవ్వడంతో డిజైన్‌ను మార్చారని, దాని వల్ల ప్రస్తుతం 60 ఎకరాల విలువైన సాగుభూమి రైల్వే కిందకు వెళ్లే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
బాగా పంటలు పండే సారవంతమైన భూమి రైలు కట్ట కింద పోవడంతో తాము తీవ్రంగా నష్టపోతామని రైతులు పేర్కొన్నారు. రెండోసారి రూపొందించిన డిజైన్‌ను తాము అంగీకరించడం లేదని తెలిపారు. ఈ విషయం పై ఆందోళన చేపట్టగా, రైల్వే అధికారులు, జిల్లా రెవెన్యూ అధికారులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించారని చెప్పారు. ఆ సూచనల మేరకు 2026 జనవరి 9న తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ, ఇప్పటి వరకు తమ ఫిర్యాదును పై అధికారులకు పంపించలేదని రైతులు ఆరోపించారు. దీంతో తాము మరింత నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రస్తుత డిజైన్ ప్రకారం రైలు కట్ట నిర్మాణం జరగనివ్వమని, తమకు న్యాయం జరిగే వరకు అన్ని విధాలుగా అడ్డుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామని తెలిపారు. పత్రికల ద్వారా అయినా తమ గోడును జిల్లా అధికారులు, రైల్వే అధికారులు పరిగణనలోకి తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు.
రైతుల గోడు విన్న తహసీల్దార్, ఈ విషయంలో తాను ఏమీ చేయలేనని, రైల్వే అధికారులు, జిల్లా అధికారులకు నేరుగా ఫిర్యాదు చేసుకోవాలని సూచించారు. తొలుత వినతిపత్రాన్ని స్వీకరించేందుకు అంగీకరించని తహసీల్దార్, బాధిత రైతుల ఒత్తిడి మేరకు చివరకు వినతిపత్రాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బాధిత రైతులు బోజడ్ల బసవయ్య, వంగాల నాగేశ్వరరావు, పుల్లారావు, తాళ్లూరి మధుసూదన్‌రావు, బండారు హనుమంతరావు, వల్లవి కొండలరావు, తాళ్లూరి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.






