- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాన్సులేట్ పేరుతో కాల్స్ నమ్మొద్దు: కెనడాలోని భారత పౌరులకు అడ్వైజరీ
కెనడాలో ఉన్న భారతీయ పౌరులను లక్ష్యంగా చేసుకుని అంతర్జాతీయ సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలకు తెరలేపడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

దిశ, వెబ్ డెస్క్ : కెనడాలో ఉన్నత చదువుల కోసం, ఉద్యోగాల కోసం, శాశ్వత నివాసం కోసం వెళ్లిన భారతీయ పౌరులను, ముఖ్యంగా విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని అంతర్జాతీయ సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలకు తెరలేపడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కెనడాలోని భారత కాన్సులేట్ జనరల్ (Consulate General of India) అధికారుల పేరిట చలామణి అవుతున్న ఈ నకిలీ కాల్స్ నెట్‌వర్క్ వెనుక ఉన్న కేటుగాళ్లు అత్యంత అధునాతన సాంకేతికతను వాడుతున్నారు. స్ఫూఫింగ్ (Caller ID Spoofing) టెక్నాలజీ ద్వారా భారత రాయబార కార్యాలయానికి చెందిన అసలైన అధికారిక ఫోన్ నంబర్లనే బాధితుల మొబైల్ స్క్రీన్‌లపై కనిపించేలా చేస్తూ, తాము నిజమైన అధికారులమేనని నమ్మిస్తున్నారు. అవతలి వ్యక్తి ఫోన్ ఎత్తగానే తమను తాము కాన్సులేట్ ప్రతినిధులుగా పరిచయం చేసుకుంటూ, బాధితుల వీసా దరఖాస్తుల్లో, ఇమిగ్రేషన్ పత్రాలలో తీవ్రమైన లోపాలు ఉన్నాయని, వారు సమర్పించిన పత్రాలు నకిలీవని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
కెనడా నుంచి తక్షణమే స్వదేశానికి డిపోర్ట్ చేయిస్తామని లేదా జైలుకు పంపుతామని బెదిరిస్తూ, ఆయా సమస్యల నుంచి బయటపడటానికి పెనాల్టీలు ఫీజుల రూపంలో తక్షణమే ఆన్‌లైన్ ద్వారా డబ్బులు బదిలీ చేయించుకుంటున్నారు. ఈ తరహా మోసపూరిత కాల్స్ పై కెనడాలోని భారత రాయబార కార్యాలయానికి వరుసగా ఫిర్యాదులు అందుతుండటంతో, భారత కాన్సులేట్ జనరల్ స్పందిస్తూ 'ఎక్స్' వేదికగా అక్కడి భారతీయ పౌరుల కోసం ఒక కీలక అడ్వైజరీ జారీ చేసింది. కెనడాలో నివసిస్తున్న భారతీయ విద్యార్థులు, వలసదారులు ఇలాంటి బెదిరింపు కాల్స్ పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని, భయపడి ఎలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దని అధికారులు గట్టిగా సూచించారు. భారత ప్రభుత్వానికి చెందిన కాన్సులేట్ ఎంబసీ అధికారులు ఎట్టిపరిస్థితుల్లోనూ ఫోన్ల ద్వారా పౌరులను డబ్బులు డిమాండ్ చేయరని, వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలు, ఓటీపీలు అడగరని స్పష్టం చేశారు.
ఒకవేళ మొబైల్ స్క్రీన్‌పై కాన్సులేట్ నంబర్ కనిపించినప్పటికీ, అవతలి వ్యక్తి వీసా రద్దు చేస్తామనో, డబ్బులు చెల్లించాలనో మాట్లాడితే అది కచ్చితంగా నకిలీ కాల్ అని గ్రహించి వెంటనే ఫోన్ కట్ చేయాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా, అలాంటి మోసపూరిత సంఘటనలు ఎదురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్థానిక కెనడియన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు, భారత కాన్సులేట్ కు సమాచారాన్ని అందించి అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.






