కల్తీ అల్లం పేస్ట్ ముఠా గుట్టురట్టు

by Ratna Kumari |

రామన్నపేట పోలీసుల అప్రమత్తతతో భారీ కల్తీ అల్లం పేస్ట్ తయారీ, అక్రమ రవాణా దందా వెలుగులోకి వచ్చింది.

కల్తీ అల్లం పేస్ట్ ముఠా గుట్టురట్టు
X

దిశ, రామన్నపేట : రామన్నపేట పోలీసుల అప్రమత్తతతో భారీ కల్తీ అల్లం పేస్ట్ తయారీ, అక్రమ రవాణా దందా వెలుగులోకి వచ్చింది. సాధారణ వాహన తనిఖీల్లో అనుమానాస్పదంగా వెళ్తున్న ఓ వ్యాన్‌ను పోలీసులు ఆపి తనిఖీ చేయగా, ఎలాంటి అనుమతులు లేకుండా పెద్ద మొత్తంలో అల్లం పేస్ట్ డబ్బాలను తరలిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే వ్యాన్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని రామన్నపేట సీఐ ఎం. రవి, ఎస్సై జి. సతీష్ విచారించగా, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసరలో అక్రమంగా అల్లం పేస్ట్ తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించాడు.

దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్ రెడ్డి పర్యవేక్షణలో రామన్నపేట సీఐ ఎం. రవి నేతృత్వంలో ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి కీసరలోని తయారీ కేంద్రంపై సంయుక్తంగా దాడులు నిర్వహించారు. తనిఖీల్లో భారీ మొత్తంలో కల్తీ అల్లం పేస్ట్, నాసిరకం ముడి పదార్థాలు, తయారీ యంత్రాలు, ప్యాకింగ్ సామగ్రితో పాటు విక్రయానికి సిద్ధంగా ఉంచిన ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఎస్సై అప్రమత్తతతోనే దందా బట్టబయలు..

సాధారణ వాహన తనిఖీలను కూడా నిశితంగా నిర్వహించిన ఎస్సై జి.సతీష్ సమయస్ఫూర్తి వల్లే ఈ భారీ కల్తీ ఆహార దందా బయటపడిందని అధికారులు తెలిపారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే వారిపై కఠిన చర్యలు కొనసాగిస్తామని పోలీసులు హెచ్చరించారు. ఎస్సై సతీష్ అప్రమత్తతతోనే పెద్ద ఎత్తున కల్తీ అల్లం పేస్ట్ మార్కెట్‌లోకి వెళ్లకుండా అడ్డుకట్ట పడిందని స్థానికులు ప్రశంసించారు.

Next Story