ఆదిలాబాద్‌కు మళ్లీ మొండి చేయి

by Muthe.Rajitha |

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కార్పొరేషన్ పదవుల పంపిణీలో తీవ్ర అన్యాయం జరిగింది.

ఆదిలాబాద్‌కు మళ్లీ మొండి చేయి
X

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కార్పొరేషన్ పదవుల పంపిణీలో తీవ్ర అన్యాయం జరిగింది. తాజాగా భర్తీ చేసిన 20 కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో జిల్లాకు సున్నా ప్రాధాన్యం దక్కింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చిన మూడు పదవుల హామీ ఉత్తదేనని తేలింది. సీఎం రేవంత్ రెడ్డి గతంలో సభల సాక్షిగా ఇచ్చిన మాటలు సైతం కార్యరూపం దాల్చలేదు. పొరుగున ఉన్న నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు వరుసగా నామినేటెడ్ పదవులు దక్కుతున్నాయి. జిల్లా ఇన్చార్జి నేతల హామీలను నమ్మి పార్టీ కోసం కష్టపడ్డ నేతలు ఇప్పుడు పెదవి విరుస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ముఖ్య నేతలకు సైతం మొండిచేయి ఎదురైంది. ఈ వివక్ష ఇలాగే ఉంటే ఉమ్మడి జిల్లాలో పార్టీ బలోపేతం కష్టమని నేతలు ఆవేదన చెందుతున్నారు.

- దిశ ప్రతినిధి, నిర్మల్

దిశ ప్రతినిధి, నిర్మల్ : తెలంగాణలో నామినేటెడ్ పదవుల పంపిణీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలకు మరోసారి నిరాశనే మిగిల్చింది. కార్పొరేషన్ చైర్మన్ పదవుల కేటాయింపులో జిల్లాకు ఒక్కటంటే ఒక్క అవకాశం కూడా దక్కకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పక్కనే ఉన్న కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు కేబినెట్ స్థాయి పదవుల్లో పెద్దపీట వేస్తుండగా, ఆదిలాబాద్ జిల్లాను మాత్రం ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోంది. ఈ వివక్ష ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి గడ్డు రోజులు తప్పవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

నీటి మూటలైన హామీలు...

ఇటీవల నిర్మల్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా జిల్లాకు మూడు కార్పొరేషన్ పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే జిల్లా ఇన్చార్జి తాహెర్ బిన్ హందాన్ సైతం తన పదవికి రాజీనామా చేసైనా జిల్లా నేతలకు అవకాశం ఇప్పిస్తానని ప్రగల్భాలు పలికారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం గతంలో నిర్మల్, ఇంద్రవెల్లి సభలలో శ్రీహరిరావు, పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి వంటి నేతలకు రాజకీయంగా సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ బుధవారం విడుదలైన 20 కార్పొరేషన్ చైర్మన్ల జాబితాలో ఉమ్మడి జిల్లాకు చెందిన ఏ ఒక్క నేత పేరు లేకపోవడంతో ఆ హామీలన్నీ నీటి మూటలేనని తేలిపోయింది.

పక్క జిల్లాలకు పండగ.. మనకు దండగ!

నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే ఐదుగురు చైర్మన్లు ఉండగా తాజాగా మరొకరికి అవకాశం ఇచ్చారు. కరీంనగర్ జిల్లాలోనూ మరో ఇద్దరికి కొత్తగా బాధ్యతలు కట్టబెట్టారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు, ఉమ్మడి జిల్లాలో మొత్తం 10నియోజకవర్గాలు ఉన్నప్పటికీ ఒక్కరిని కూడా పరిగణనలోకి తీసుకోకపోవడంపై స్థానిక శ్రేణులు మండిపడుతున్నాయి. బీఆర్ఎస్ బలంగా ఉన్న సమయంలో పార్టీని వదిలి కాంగ్రెస్‌లో చేరిన నేతలకు సైతం గుర్తింపు లేకపోవడంతో క్యాడర్‌లో నైరాశ్యం అలుముకుంది. సీనియర్ల ఆవేదన అరణ్య రోదనగానే మిగిలిపోవడంతో జిల్లాలో పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

Next Story