ఏప్రిల్ మొదట్లోనే అగ్నిగుండంగా ఆదిలాబాద్

by Malleboina Mahesh |

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భానుడి భగభగలు! 44 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రత. వడగాల్పులు, విద్యుత్ కోతలతో ప్రజల అల్లాటప్పా.

ఏప్రిల్ మొదట్లోనే అగ్నిగుండంగా ఆదిలాబాద్
X

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండల తీవ్రత ఒక్కసారిగా పెరిగి, ప్రజలు అల్లాడిపోతున్నారు. గత మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు గరిష్టంగా 42 నుంచి 44 డిగ్రీల వరకు నమోదు అవుతున్నాయి. ఏప్రిల్ మొదట్లోనే ముందస్తుగా ముదిరిన ఎండలు జనాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. సింగరేణి బొగ్గు గని ప్రాంతాల్లో ఎండ వేడికి కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం వేళ వడగాల్పుల కారణంగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలు, రైతులు పనులు చేసుకోలేని పరిస్థితి నెలకొన్నది. తరచూ విద్యుత్ కోతలు కూడా తోడవడంతో ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

దిశ ప్రతినిధి, నిర్మల్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండల తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. సాధారణంగా ఏప్రిల్ మధ్య తర్వాత ముదిరే ఎండలు, ఈసారి ముందస్తుగానే దంచికొడుతున్నాయి. గత మూడు రోజులుగా వాతావరణంలో వచ్చిన మార్పులతో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు పైగానే నమోదవుతున్నాయి. నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో గరిష్టంగా 41 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఈ సీజన్‌లో ఇవే అత్యధిక ఉష్ణోగ్రతలుగా అధికారులు పేర్కొంటున్నారు.

సింగరేణిలో మంటలు.. కూలీల కష్టాలు

తీవ్రమైన ఎండల కారణంగా సింగరేణి బొగ్గు గని కార్మికులు విధుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓపెన్ కాస్ట్ గనుల్లో ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా ఉండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. అటు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలు, రైతులు ఉదయం 10 గంటలు దాటితే పొలాల్లో పనిచేసే పరిస్థితి కనిపించడం లేదు. ఎండ దెబ్బకు భయపడి జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు.

రోడ్లు నిర్మానుషం.. ఉక్కపోతతో నరకం

మధ్యాహ్నం వేళ తీవ్ర ఎండ, వడగాల్పుల కారణంగా జిల్లా కేంద్రాల్లో ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఉద్యోగులు, అధికారులు, సామాన్య ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. దీనికి తోడు తరచుగా జరుగుతున్న కరెంట్ కోతలు ప్రజలను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతూ, ఎండల నుంచి ఉపశమనం కోసం తల్లడిల్లుతున్నారు.

Next Story