జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు

by Ratna Kumari |

రైతులకు యూరియా ఎరువుల కొరత లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని, యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు.

జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు
X

దిశ, కామారెడ్డి: జిల్లాలో రైతులకు యూరియా ఎరువుల కొరత లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని, అవసరమైన మేరకు యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. రైతులు యూరియా లభ్యతపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎరువుల సరఫరాను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక మొబైల్ యాప్‌ను అమలు చేస్తోందని కలెక్టర్ తెలిపారు. ఈ యాప్ ద్వారా రైతులు సాగు చేస్తున్న పంటల విస్తీర్ణానికి అనుగుణంగా యూరియా పంపిణీ జరుగుతోందన్నారు. దీనివల్ల ఎరువుల సమాన పంపిణీతో పాటు అక్రమ నిల్వలు, మళ్లింపులను అరికట్టడం సాధ్యమవుతోందని పేర్కొన్నారు. గత వానాకాలంతో పోలిస్తే ప్రస్తుతం వరి నాట్లు నమోదైన విస్తీర్ణం తక్కువగా ఉన్నప్పటికీ రైతులు ముందస్తుగా యూరియాను కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. గత ఏడాది ఇదే సమయానికి జిల్లాలో 5,571 ఎకరాల్లో వరి నాట్లు నమోదుకాగా, ఈ ఏడాది ఇప్పటివరకు 250 ఎకరాల్లో మాత్రమే నాట్లు నమోదయ్యాయని చెప్పారు. అయితే, గత ఏడాది ఇదే తేదీ నాటికి 2.37 లక్షల యూరియా బస్తాలు కొనుగోలు చేయగా, ఈ ఏడాది ఇప్పటికే 2.64 లక్షల బస్తాలను రైతులు కొనుగోలు చేసినట్లు వివరించారు. ప్రస్తుతం జిల్లాలో 0.65 లక్షల యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నాయని, అదనంగా అవసరమైన మేరకు నిల్వలను నిరంతరం సమకూరుస్తున్నామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 1.25 లక్షల ఎకరాల్లో వరి నర్సరీలు పెంచబడిన నేపథ్యంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 85 లక్షల బస్తులకు పైగా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, రైతులు యాప్ ద్వారా బుకింగ్ చేసుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువులను పొందవచ్చని తెలిపారు. రైతుల అవసరాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ తగిన నిల్వలను అందుబాటులో ఉంచుతోందని చెప్పారు. ఈ సందర్భంగా రైతులు యూరియా లభ్యతపై ఎలాంటి అపోహలు, ఆందోళనలకు గురికాకుండా అవసరమైన మేరకు మాత్రమే ఎరువులను కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు.

Next Story