డీటీవో వెంకన్న మృతిపై ప్రభుత్వం సీరియస్.. జేటీసీతో విచారణకు ఆదేశం

by Prasad Jukanti |

భూపాలపల్లి డీటీవో వెంకన్న మృతిపై జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌తో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

డీటీవో వెంకన్న మృతిపై ప్రభుత్వం సీరియస్.. జేటీసీతో విచారణకు ఆదేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూర్‍లో డీటీవో వెంకన్న మృతికి కారణమైన రోడ్డు ప్రమాదం ఘటనను ప్రభుత్వం అత్యంత సీరియస్‍గా తీసుకుంది. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, వాస్తవాలను సమగ్రంగా తెలుసుకోవడంతో పాటు భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు సూచించేందుకు విచారణకు ఆదేశించింది. ఈ ప్రమాద ఘటనపై లోతైన దర్యాప్తు జరిపేందుకు రవాణా కమిషనర్ కార్యాలయంలోని జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఎం.చంద్రశేఖర్ గౌడ్‍ను విచారణ అధికారిగా ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రమాదానికి సంబంధించిన అన్ని కోణాలను పరిశీలించి, పూర్తి నివేదికను వీలైనంత త్వరగా ప్రభుత్వానికి సమర్పించాలని పేర్కొంది.

అధికారుల భద్రతపై ప్రత్యేక మార్గదర్శకాలు:

క్షేత్రస్థాయిలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించే రవాణా శాఖ అధికారుల భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. వాహనాల తనిఖీలు, నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను సీజ్ చేసే ప్రక్రియలలో ఎలాంటి భద్రతా ప్రమాణాలు (Safety Standards), ప్రోటోకాల్స్ అనుసరించాలనే అంశాలపై స్పష్టమైన సూచనలు మరియు సిఫార్సులు ఇవ్వాలని విచారణ అధికారిని ప్రభుత్వం ఆదేశించింది. ఈ విచారణ నివేదిక అందిన వెంటనే, అందులోని సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం తదుపరి కఠిన చర్యలు తీసుకోనుంది.

ఇది యాక్సిడెంటే: మంత్రి పొన్నం

డీటీవో వెంకన్న మృతి బాధాకరం అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. వెంకన్న ఇటీవల జగిత్యాల నుండి భూపాలపల్లికి బదిలీ అయి వచ్చారని ఆయన స్వగ్రామం మహబూబాబాద్ వద్ద మరిపెడ బంగ్లా అని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన హార్వెస్టర్ రవాణా శాఖ కార్యాలయానికి తీసుకొస్తున్న సమయంలో అటు నుండి వస్తున్న టిప్పర్ ఢీ కొట్టి వెంకన్న మృతి చెందారని ఇది ప్రమాదమేనని ఇందులో ఎవరి ప్రమేయం లేదని స్పష్టం చేశారు. వెంకన్న మృతిపై తాను జిల్లా కలెక్టర్, ఎస్పీ తో మాట్లాడానని ప్రిన్సిపాల్ సెక్రటరీతో విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. సీఎం ఢిల్లీ నుంచే ఘటనపై స్పందించి విచారణకు ఆదేశించారని తెలిపారు. వెంకన్న ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని ఈ సమయంలో శవ రాజకీయాలు వద్దన్నారు. వారి కుటుంబానికి ఉద్యోగంతో పాటు ఎక్స్ గ్రేషియా ఇస్తామన్నారు.

Next Story