మరోసారి అమెరికా కోర్టుకు అదానీ

by Muthe.Rajitha |

అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ మరోసారి అమెరికా కోర్టు మెట్లు ఎక్కనున్నారు.

మరోసారి అమెరికా కోర్టుకు అదానీ
X

దిశ, వెబ్ డెస్క్ : అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ మరోసారి అమెరికా కోర్టు మెట్లు ఎక్కనున్నారు. అదానీ - అమెరికా లీగల్ వివాదంలో తనపై ఉన్న క్రిమినల్ అభియోగాలను పూర్తిగా కొట్టివేయాలన్న అమెరికా ప్రభుత్వ నిర్ణయానికి సంబంధించి, గౌతమ్ అదానీ ఈవారంలోనే అమెరికా కోర్టులో ఒక కీలక అఫిడవిట్ సమర్పించనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. కేసు ఉపసంహరణ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరిగిందా లేదా అని నిర్ధారించుకోవడానికే న్యాయస్థానం ఈ చర్యలకు ఉపక్రమించినట్లు సమాచారం.

గౌతమ్ అదానీపై ఉన్న అభియోగపత్రాన్ని శాశ్వతంగా కొట్టివేయాలని అమెరికా న్యాయశాఖ కోర్టును అభ్యర్థించింది. అయితే, ఈ అభ్యర్థనపై తుది తీర్పు ఇచ్చే ముందే, అంటే ఈనెల 15వ తేదీ లోపు అదానీ తన ప్రమాణ పత్రాన్ని దాఖలు చేయాలని అమెరికా కోర్టు న్యాయమూర్తి గడువు విధించారు. ఈ అఫిడవిట్‌లో గౌతమ్ అదానీ ముఖ్యంగా తనపై ఉన్న కేసును ఉపసంహరించుకోవడానికి బదులుగా అమెరికా ప్రభుత్వంతో వెనుక ఎలాంటి వాగ్దానాలు, ప్రతిపాదనలు లేదా రహస్య ఒప్పందాలు జరిగాయా అనే విషయాలను స్పష్టం చేయాల్సి ఉంటుంది.

దీనితో పాటు, ఈ కేసును కొట్టివేయడం ద్వారా ప్రభుత్వానికి లేదా ఇతరులకు ఏదైనా లబ్ధి చేకూర్చడం వంటి విషయాలు ఆయనకు తెలుసా అనేది కూడా అందులో పేర్కొనాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఈనెల 15వ తేదీ లోగా గౌతమ్ అదానీ సమర్పించబోయే ఈ ప్రమాణ పత్రం ఆధారంగానే, అమెరికా కోర్టు ఈ హై-ప్రొఫైల్ క్రిమినల్ కేసు కొట్టివేతపై తన తుది నిర్ణయాన్ని వెలువరించనుంది.

Next Story