క్యాన్సర్ నిర్ధారణలో ‘ఏఐ’తో సరికొత్త విప్లవం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన నివేదిక

by Kema Shiva Kumar |

క్యాన్సర్ నిర్ధారణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అద్భుతాలు చేస్తోంది.

క్యాన్సర్ నిర్ధారణలో ‘ఏఐ’తో సరికొత్త విప్లవం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన నివేదిక
X

దిశ, తెలంగాణ బ్యూరో: క్యాన్సర్ నిర్ధారణ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సరికొత్త విప్లవానికి తెరలేపుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తన తాజా నివేదికలో వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా నిపుణులైన రేడియాలజిస్టులు, పాథాలజిస్టుల కొరత తీవ్రంగా వేధిస్తున్న తరుణంలో ఏఐ ఆధారిత ఇమేజింగ్, డిజిటల్ పాథాలజీ వ్యవస్థలు వ్యాధిని ప్రాథమిక దశలోనే అత్యంత ఖచ్చితత్వంతో గుర్తిస్తున్నట్టు నివేదిక స్పష్టం చేసింది. క్లినికల్ ట్రయల్స్‌లో మానవ తప్పిదాలను తగ్గించడంలో ఈ సరికొత్త డిజిటల్ మెడిసిన్ అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని శాస్త్రవేత్తలు నిరూపించారు.

ఏఐతో సులభతరం..

సాధారణంగా ప్రారంభ దశలో ఉండే క్యాన్సర్ కణాల సూక్ష్మ మార్పులను సాధారణ ఎక్స్-రేలు లేదా స్కానింగులలో గుర్తించడం వైద్యులకు కూడా కొన్నిసార్లు సవాలుగా మారుతుంది. అయితే ఏఐ అల్గారిథమ్స్ ఈ క్లిష్టమైన ప్రక్రియను ఎంతో సులభతరం చేస్తున్నాయి. బయాప్సీ చేసిన కణజాలాలను విశ్లేషించే డిజిటల్ పాథాలజీలో ఏఐ దాదాపు 96.3 శాతం సున్నితత్వంతో, 93.3 శాతం ఖచ్చితత్వంతో క్యాన్సర్ ఉనికిని గుర్తిస్తోంది. అలాగే పురుషులలో వచ్చే ప్రొస్టేట్ క్యాన్సర్ నిర్ధారణలో ఉపయోగించే హిస్టోలాజిక్ అనాలిసిస్‌లో డీప్ లెర్నింగ్ మోడల్స్ 99 శాతం అత్యుత్తమ ఫలితాలను సాధించాయి. గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) క్యాన్సర్‌కు సంబంధించిన పాథాలజీ పరీక్షల్లో సాధారణ కణాలకు, క్యాన్సర్ కణాలకు మధ్య ఉన్న తేడాలను ఏఐ 92 నుంచి 98 శాతం ఖచ్చితత్వంతో వేరు చేసి చూపిస్తోంది. మమ్మోగ్రఫీ స్క్రీనింగ్, ఊపిరితిత్తుల ఇమేజింగ్ పరీక్షల్లో ఏఐ వ్యవస్థలను ఉపయోగించడం వల్ల క్యాన్సర్ ముదిరిపోయే లోపే గుర్తించే రేటు పెరిగినట్టు అంతర్జాతీయ క్లినికల్ ట్రయల్స్ స్పష్టం చేస్తున్నాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్ ఇమేజింగ్‌లో చిన్న చిన్న గడ్డలను గుర్తించడంలో ఏఐ మోడల్స్ 86 నుంచి 87 శాతం విజయవంతమయ్యాయి. రొమ్ము క్యాన్సర్ నిర్ధారణలో రేడియాలజిస్టుల పనిభారాన్ని తగ్గించడంతో పాటు, తప్పుడు రిపోర్టులు వచ్చే అవకాశాలను ఏఐ గణనీయంగా నివారిస్తోందని నివేదిక పేర్కొంది.

నిధుల కొరత..

ఈ సరికొత్త ఏఐ సాంకేతికతలు కేవలం నగరాలు, పట్టణ ప్రాంతాలకే పరిమితం కాకుండా, వైద్య సదుపాయాలు లేని గ్రామీణ ప్రాంతాలకు, పేద దేశాలకు చేరాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంటోంది. పోర్టబుల్ ఏఐ పరికరాల ద్వారా తక్కువ ఖర్చుతోనే స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నప్పటికీ, వీటికి సరైన క్లినికల్ వాలిడేషన్, ప్రభుత్వాల నియంత్రణ అనుమతులు, నిధుల కొరత ప్రధాన అడ్డంకులుగా మారాయి. ఈ డిజిటల్ ఆవిష్కరణలను ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలలో భాగం చేసినప్పుడే, ప్రపంచవ్యాప్తంగా వైద్యుల కొరతను అధిగమించి, లక్షలాది మంది సామాన్య రోగులకు సకాలంలో ప్రాణదానం చేయవచ్చని నివేదిక తేల్చి చెప్పింది.

దేశంలో క్యాన్సర్ కారణంగా ప్రతి సంవత్సరం దేశ జీడీపీలో సుమారు 1 శాతం వరకు ఆర్థిక నష్టం సంభవిస్తోంది. దేశంలో దాదాపు 40 శాతం క్యాన్సర్ కేసులు అత్యంత ఆలస్య దశలోనే గుర్తించబడుతున్నాయి. ఫలితంగా చికిత్స క్లిష్టంగా మారుతోంది. ప్రస్తుతం అమలులో ఉన్న కొన్ని క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాల్లో అవసరం లేని నిర్ధారణలు కూడా జరుగుతున్నాయి. పైగా చిన్నపిల్లల క్యాన్సర్లు, పెద్దపేగు (కొలన్) క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించే స్క్రీనింగ్ వ్యవస్థలు ఇంకా బలహీనంగానే ఉన్నాయి. వీటికి తోడు క్యాన్సర్ నిపుణుల కొరత తీవ్రంగా ఉంది. పెట్ స్కానర్లు, రేడియోథెరపీ సౌకర్యాల లభ్యత ప్రపంచంలోనే అత్యల్పంగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. తీవ్రమైన ఈ అడ్డంకులను అధిగమించి క్షేత్రస్థాయిలో నాణ్యమైన సేవలు అందించాలంటే మనదేశంలో ఏఐ ఆధారిత క్యాన్సర్ గుర్తింపు, స్క్రీనింగ్, ఖచ్చితమైన నిర్ధారణ, చికిత్సా ప్రణాళికలను వైద్య వ్యవస్థలో విస్తృతంగా వినియోగించడం అత్యంత ఆవశ్యకం.

- డా. కిరణ్ మాదాల, క్రిటికల్ కేర్ ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడీ - గాంధీ హాస్పిటల్

Next Story