ఎమ్మా గేట్ ఉడ్ - మన గిరిజా పైడిమర్రి : రాఘవ

by Muthe.Rajitha |

ట్రెక్కింగ్ అంటే, సెల ఏటి సంగీతాన్ని ఆస్వాదించడం. రాతి సితారపై జల సంగీతాన్ని మీటినట్టు, దుమికే జలపాతాల హోరును వింటూ, ఆ అందాల్ని వీక్షించడం.

ఎమ్మా గేట్ ఉడ్ - మన గిరిజా పైడిమర్రి : రాఘవ
X

ట్రెక్కింగ్ అంటే, సెల ఏటి సంగీతాన్ని ఆస్వాదించడం. రాతి సితారపై జల సంగీతాన్ని మీటినట్టు, దుమికే జలపాతాల హోరును వింటూ, ఆ అందాల్ని వీక్షించడం. చెట్లు, పిట్టలు, పుట్టలను పలకరించడం. చీలిన రాతి కొండల్లోని మౌన శిలలతో ముచ్చటించడం. అడవి తల్లి చల్లని కనురెప్పల నీడల్లో సేదదీరడం. వెన్నెల్లో నిద్రించడం. ప్రకృతి ముందు మోకరిల్లడం. మనని మనం పునః సమీక్షించుకుని, విశ్వమానవులుగా అవతరించడం.

నీలాకాశంలో క్యాట్ వాక్ చేసే మేఘాలు. వెదురు పొదల్లోంచి వినిపించే వాయు లీనాలు. వీచే గాలికి తలలూపే రెల్లు పొదలు. తల విరబోసుకుని విరగబడి నవ్వినట్టుండే మహా వృక్షాలు. జాతి వివక్ష లేకుండా పెనవేసుకునే చెట్లు, తీగలు. సమిష్టిగా జీవించే అడవి జంతువులు. చెట్ల కొమ్మల్లో గూళ్లు కట్టుకునే పక్షుల ముక్కెంత? వాటి బలమెంత? నింగి నుంచే అడవి అందాలను వీక్షిస్తాయి. చినుకు రాలినా, గాలి వీచినా, కిరణాలు తాకినా అడివి అడివంతా పులకరించిపోతుంది. ఈ ఆనందం ట్రెక్కింగ్(హైకింగ్) లోనే సాధ్యమవుతుంది.

గిరిజకు అవార్డు

ట్రెక్కింగ్ (హైకింగ్)లో అమెరికాకు చెందిన గ్రాండ్ మా ఎమ్మా గేట్ ఉడ్ చరిత్ర సృష్టించింది. హైదరాబాద్ కు చెందిన గిరిజా పైడిమర్రి కూడా చాలా గొప్ప ట్రెక్కర్, ట్రావెలర్. ‘వెన్నెల గీత సాహిత్య సామాజిక అధ్యయన వేదిక’ ఎమ్మాగేట్ ఉడ్ ప్రేరణ తొలి అవార్డును గిరిజ పైడిమర్రికి ఈ నెల 12న హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగే సభలో ప్రదానం చేయనుంది. ట్రెక్కింగ్ లో ఎమ్మాగేట్ ఉడ్ కీ , గిరిజ పైడిమర్రికి కొన్ని సారూప్యతలున్నాయి.

ఓదార్పు కోసం అడవిలోకి

అమెరికాకి చెందిన గ్రాండ్ మా ఎమ్మా గేట్ ఉడ్ తన అరవై ఏడవ ఏట 2050 మైళ్ళున్న అపలాచియన్ ట్రయల్ వంటరిగా ఎక్కి, స్త్రీల ట్రెక్కింగ్ చరిత్రలో ఒక రికార్డు సష్టించింది. ఎమ్మాగేట్ ఉడ్ కు పదకొండు మంది సంతానం. భర్త దారుణంగా కొట్టేవాడు. అప్పుడామె తనను తాను ఓదార్చుకోడానికి అడవిలోకి పారిపోయేది. భర్త కొట్టే దెబ్బలకు పక్కటెముకలు విరిగిపోయాయి. భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఆర్థిక ఇబ్బందుల్లో అనేక పనులు చేసింది. పిల్లలంతా ప్రయోజకులయ్యాక , అన్నీ వదిలేసి 1951లో ట్రెక్కింగ్ మొదలు పెట్టింది.

అరవయ్యవ ఏట గిరిజ ట్రెక్కింగ్

గిరిజ పైడిమర్రికి ఎమ్మా గేట్ ఉడ్ లాగా భర్త వేధింపులు, కుటుంబ సమస్యలు లేవు. ఇద్దరు పిల్లలూ ప్రయోజకులయ్యాక, ఉపాధ్యాయురాలిగా ఉద్యోగ విరమణ చేశాక, తన అరవైయవ ఏట మేఘాలయ లో ట్రెక్కింగ్ మొదలు పెట్టారు. కన్యాకుమారి నుంచి, కశ్మీర్ వరకు దేశమంతా పర్యటించారు. జపాన్, మలేషియా వంటి దేశాలు సందర్శించారు. వెళ్లిన చోటల్లా కనిపించే గుళ్లు, గోపురాలు, చారిత్రక ప్రదేశాలు, అడవులు, కొండలు, సముద్రాలూ చూశారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న విభిన్న జీవన శైలులను పరిశీలించారు.

కష్టాలను అధిగమించడానికి ట్రెక్కింగ్

ఓహోయోలోని గేయన్ టౌన్ షిప్ లో 1887లో పదిహేను మంది పిల్లల్లో ఒకరిగా జన్మించిన గ్రాండ్ మా ఎమ్మా గేట్ ఉడ్ ఎనిమిదవ తరగతి వరకు చదువుకుంది. చిన్నతనం నుంచే గ్రీక్ క్లాసిక్స్ చదివేది. వన్యప్రాణులు, ఔషధాలు, ఆహారంగా ఉపయోగపడే అటవీ మొక్కల గురించి అధ్యయనం చేసింది. కవిత్వం రాయడం అలవాటు చేసుకుంది. మైలేన్ మౌంట్ కటాడిన్ నుంచి 1954లో మొదటి సారిగా ట్రెక్కింగ్ చేసింది. ఈ ట్రెక్కింగ్ లో దారి తప్పి, కళ్లద్దాలు పగిలిపోయి, తెచ్చుకున్న ఆహారం అయిపోయి అనేక అవస్థలు పడినప్పటికీ, ఇవేవీ భర్త పెట్టిన హింసలకు దరిదాపులకు కూడా రాలేదు. ఆ మరుసటి ఏడాది జార్జియాలోని ఏంట్ ఓగర్ థోర్స్ నుంచి ఉత్తర దిశగా బయలుదేరి, 146 రోజుల తరువాత మౌంట్ కటాడిన్ చేరుకుంది. అడవి ఆకులు కప్పుకుని పడుకునేది. చెర్రీ పళ్లు, అడవి మొక్కలు తినేది. అపలాచియాన్ ట్రైల్ ను 1957లో మళ్లీ నడిచింది. ఆ మరుసటి ఏడాది న్యూయార్క్ లోని అడిరోన్ డార్క్ పర్వతాల్లో ఆరు పర్వతాలను ఎక్కింది. ఇలా ఎన్నో ట్రెక్కింగ్ లను పూర్తి చేసిన ఎమ్మా గేట్ ఉడ్ 1973లో ఎనభై ఆరేళ్ల వయసులో తుదిశ్వాస విడవడానికి కొద్ది రోజుల ముందు సుదీర్ఘ బస్సు యాత్ర చేసింది. ఆమె జీవితంలో మొత్తం ఇరవై మూడు వేల కిలోమీటర్లు నడిచింది. ఇది భూమి చుట్టు కొలతకు సగ భాగం పైనే.

‘గిరిగమనం’లో భారత దర్శనం

మెదక్ జిల్లాకు చెందిన గిరిజ పైడిమర్రి ఎంఫిల్ చేశారు. మూడు దశాబ్దాలపైగా ఉపాధ్యాయురాలిగా పనిచేసి, విద్యారంగం, పిల్లల మనస్తత్వం, సామాజిక అంశాల పైన మంచి అవగాహన ఏర్పాటు చేసుకున్నారు. సాహిత్య పఠనం ప్ర వృత్తి. చేసిన ప్రతి ట్రెక్ గురించి, చూసిన ప్రతి ప్రదేశం గురించి పత్రికలలో కథనాలు రాశారు. ఆ అనుభవాలన్నిటినీ ‘గిరిగమనం’ లో నిక్షిప్తం చేశారు.

సాహసి గిరిజ

శేషాచలం కొండల్లోని తుంబురు తీర్థానికి కుక్కల దొడ్డివైపు నుంచి పదహారు కిలోమీటర్ల నడక. నీటి ప్రవాహంతో నిండిన ఆరు మోకాలు లోతు కాల్వలను, పన్నెండు నడుములోతు కాల్వలను దాటుతూ, పదమూడు గంటల పాటు ఏకబిగిన నడిచారు. పెద్ద పెద్ద బండరాళ్లను ఎక్కుతూ, దిగుతూ సలేశ్రం ట్రెక్ పూర్తి చేశారు. కర్ణాటకలోని కాళీ నదిలో పడవపైన ప్రయాణం చేస్తూ, లైఫ్ జాకెట్ తో నదిలోకి దూకి, మళ్లీ బోటెక్కారు. దుమికే జలపాతాలు, పరవళ్లు తొక్కే ప్రవాహాలు, పశ్చిమ కనుమల్లో ప్రకృతి సోయగాలను ఆస్వాదించారు. సబ్ మెరైన్ లో కూర్చుని నలభై ఐదు నిమిషాలపాటు సముద్ర గర్భంలో ప్రయాణం. ఎత్తైన పర్వతాల మధ్య, లోతైన లోయల్లో నందనవనాన్ని చూసి ఎంత మురిసిపోయారో, అండమాన్ జైలులో బ్రిటిష్ వారు పెట్టిన హింసలను గుర్తుచేసుకుని అంతగా కలత చెందారు. కంచిలో పట్టు చీరల నేత వెనుక ఉన్న కార్మికుల శ్రమను గుర్తు చేస్తారు. లక్షద్వీప్, జయసల్మేర్ కోట, మెదక్ కోట, మహరాష్ట్రలో భిలార్ పుస్తక గ్రామం; ఇలా అనేకానేక సందర్శనల గురించి రాసిన ‘గిరిగమనం’ పాక్షికంగానైనా భారత దర్శనమే.

- రాఘవ

Next Story