గజదొంగలు.. 25k వోల్ట్స్ రైల్వే హై-టెన్షన్ కేబుల్ లేపేశారు

by Muthe.Rajitha |

ప్రాణాలకే ముప్పు తెచ్చే 25k వోల్ట్స్ రైల్వే హై-టెన్షన్ విద్యుత్ తీగలను ఎత్తుకెళ్లారు బీహార్ దొంగలు.

గజదొంగలు.. 25k వోల్ట్స్ రైల్వే హై-టెన్షన్ కేబుల్ లేపేశారు
X

దిశ, వెబ్ డెస్క్ : ఇంట్లో ఉండే బంగారం, నగదు దొంగిలించే రోజులు పోయాయి.. ఇప్పుడు రోడ్లు, ఇనుప బ్రిడ్జీలు, మొబైల్ టవర్లు, చివరికి చెరువుల్లోని నీళ్లను కూడా మాయం చేయడంలో బీహార్ దొంగలు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. తాజాగా వీరు మరో అడుగు ముందుకు వేసి, ఏకంగా ప్రాణాలకే ముప్పు తెచ్చే రైల్వే హై-టెన్షన్ విద్యుత్ తీగలను కూడా వదలకుండా ఎత్తుకెళ్లారు.

25k వోల్ట్స్ కరెంట్ ఉన్న కేబుల్‌నే కత్తిరించేశారు!

రైల్వే లైన్‌పై ఉండే 25,000 వోల్ట్స్ (25kv) హై-టెన్షన్ ఓవర్‌హెడ్ కేబుల్‌ను బీహార్‌కు చెందిన కొందరు దొంగలు చాకచక్యంగా కత్తిరించి దొంగిలించారు. ఏకంగా 100 మీటర్ల పొడవు ఉన్న ఈ రాగి వైరును వారు క్షణాల్లో మాయం చేశారు. అంతటి హై-వోల్టేజ్ కరెంట్ సరఫరా అవుతున్నప్పటికీ, ప్రాణాలకు తెగించి వారు ఈ పని చేయడం గమనార్హం. ఈ భారీ చోరీ కారణంగా రైల్వే రక్షణ, సిగ్నలింగ్, కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా స్తంభించి పోయాయి. దీనితో ఆ మార్గంలో నడిచే పలు రైళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయి, గంటల తరబడి ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దీంతో అసలు ఏం జరిగిందో తెలియక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

రద్దీగా ఉండే లైన్‌లోనే స్కెచ్!

ఈ దొంగతనం ఏదో మారుమూల అడవిలోనో లేదా నిర్మానుష్య ప్రాంతంలోనో జరగలేదు. రాష్ట్రంలోనే అత్యంత రద్దీగా ఉండే పట్నా-గయా (Patna-Gaya) రైల్వే లైన్ పరిధిలో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. నిరంతరం రైళ్ల రాకపోకలు సాగే ట్రాక్‌పై ఇంతటి సాహసానికి ఎలా ఒడిగట్టారని అధికారులు కూడా షాక్‌కు గురయ్యారు. ఈ విచిత్రమైన దొంగతనం వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు బీహార్ దొంగల 'క్రియేటివిటీ'పై జోకులు పేలుస్తున్నారు. 'కాజేయడానికి కాదేది అనర్హం' అని నిరూపిస్తున్నారు" అంటూ కామెంట్లు పెడుతున్నారు. గతంలో ఇదే బీహార్‌లో ఏకంగా రైలు ఇంజన్‌ను, కిలోమీటర్ల పొడవున్న రైల్వే ట్రాక్‌ను కూడా దొంగిలించిన రికార్డులు ఉండటం విశేషం. ప్రస్తుతం పోలీసులు ఈ ముఠా కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Next Story