- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ బడిలో రోబో పాఠాలు: మోడల్ స్కూల్‌గా జన్వాడ జెడ్పీహెచ్‌ఎస్!
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో సరికొత్త విప్లవం మొదలైంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా రంగాన్ని బలోపేతం చేసేందుకు, ప్రైవేటు-ప్రభుత్వ భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ఒక ముందడుగు వేసింది. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని జన్వాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను దత్తత తీసుకొని, దానిని ఒక మోడల్ స్కూల్‌గా తీర్చిదిద్దేందుకు హైదరాబాద్‌లోని ప్రముఖ ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ ముందుకు వచ్చింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖతో ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ బుధవారం ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్.. ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఫరిదా ఫ్రాజ్ సమక్షంలో ఈ ఒప్పంద పత్రాలను పరస్పరం మార్చుకున్నారు.
మొదటి దశలో మౌలిక వసతుల కల్పన
దాదాపు 750 మంది విద్యార్థుల సామర్థ్యం కలిగిన జన్వాడ జెడ్పీహెచ్‌ఎస్‌ను మోడల్ స్కూల్‌గా మార్చేందుకు ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ పూర్తి సహకారం అందిస్తోంది. మొదటి దశలో భాగంగా పాఠశాల భవన మరమ్మతులు, మౌలిక వసతుల కల్పన, ఫర్నిచర్ సమకూర్చడం, క్యాంపస్ నిర్వహణ, విద్యాపరమైన మద్దతు వంటి పనులను ఇండస్ స్కూల్ చేపట్టింది. ప్రస్తుతం ఈ క్యాంపస్ సరికొత్త రూపు సంతరించుకొని అధికారిక ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది.
రోబోటిక్ టీచర్లు.. వినూత్న బోధన
మౌలిక వసతులతో పాటు విద్యా ప్రమాణాలను పెంచేందుకు ఇండస్ స్కూల్ ముగ్గురు పూర్తి స్థాయి ఉపాధ్యాయులను ఇక్కడ నియమించింది. వీరు నిత్యం తరగతి గదుల్లో వినూత్న బోధనా పద్ధతులను అమలు చేయనున్నారు. అంతేకాకుండా, తెలంగాణలోనే రోజువారీ బోధనలో హ్యూమనాయిడ్ రోబోటిక్ టీచర్లను ఉపయోగించనున్న మొదటి ప్రభుత్వ పాఠశాలగా జెడ్పీహెచ్‌ఎస్ జన్వాడ నిలవనుంది. త్వరలోనే ఇక్కడ మూడు హ్యూమనాయిడ్ రోబోలను ప్రవేశపెట్టనున్నారు. ఇది ప్రభుత్వ పాఠశాలల్లో సాంకేతిక ఆధారిత విద్యకు ఒక మైలురాయిగా మారనుంది.
ట్విన్నింగ్ కార్యక్రమాలతో మ్యూచువల్ లెర్నింగ్
ఈ ఒప్పందం ద్వారా కేవలం మౌలిక వసతులే కాకుండా విద్యా నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాల పెంపు, విద్యార్థుల సమగ్ర వికాసానికి నిరంతర మద్దతు లభించనుంది. ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్, జన్వాడ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల మధ్య పరస్పర అభ్యాసం, సామాజిక బాధ్యతను పెంపొందించేందుకు ఉమ్మడి సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జన్వాడ పాఠశాల రూపాంతరం రాబోయే రోజుల్లో ఒక విజయవంతమైన మోడల్‌గా నిలుస్తుందని, దీనిని స్ఫూర్తిగా తీసుకుని మరిన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ పాఠశాలల దత్తతకు ముందుకు వస్తాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇతర ఇంటర్నేషనల్ స్కూళ్లకు ఇదొక రోల్ మోడల్
ప్రభుత్వ పాఠశాలను ఇంత సమగ్రంగా దత్తత తీసుకుని, అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చిన ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులను అభినందిస్తున్నాం. ఈ చొరవ ఇతర అంతర్జాతీయ, కార్పొరేట్ పాఠశాలలకు ఒక మార్గదర్శిగా నిలవాలి. ఇలాంటి పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యాలు(పీపీపీ) ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే కాకుండా, విద్యార్థులకు బెస్ట్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్‌ని అందిస్తాయి. - డాక్టర్ నవీన్ నికోలస్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్






