పరిశ్రమల శాఖలో ‘చోటా బాస్’ హల్‌చల్.. వేధింపులతో ఉద్యోగులు సతమతం

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-10 01:45:25  IST  )

తెలంగాణ పరిశ్రమల శాఖలో 'చిన్న బాస్' వేధింపులు తారాస్థాయికి చేరాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.

పరిశ్రమల శాఖలో ‘చోటా బాస్’ హల్‌చల్.. వేధింపులతో ఉద్యోగులు సతమతం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర పరిశ్రమల శాఖలో ఈ మధ్య కొత్తగా వచ్చిన చిన్న బాస్ వేధింపులు తారాస్థాయికి వెళ్లినట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతి ఫైల్‌పై ఏదో ఒక కొర్రీ వేసి అధికారులను సతాయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఎంప్లాయీస్ ఆఫీసుకు వచ్చేందుకు జంకుతుండగా, కొందరైతే లాంగ్ లీవ్‌కు ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఆయన తీరుతో విసిగిపోయిన బాధితులు చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. అప్పుడు కూడా ఆయన వ్యవహార తీరులో మార్పు రాకపోతే సామూహిక సెలవులు పెట్టాలని యోచనలో ఉన్నట్లు సమాచారం.

ఇక్కడ నా రూల్స్‌ను పాటించాలి..

విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి సెక్రటేరియట్‌కు ప్రత్యేక బిజినెస్ రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ప్రకారమే సెక్షన్ ఆఫీసర్ మొదలుకుని చీఫ్ సెక్రటరీ వరకు పనిచేయాల్సి ఉంటుంది. కానీ ఇండస్ట్రీ శాఖకు కొత్తగా వచ్చిన చిన్న బాస్ తన సొంత రూల్స్‌ను మాత్రమే పాటించాలని ఆదేశాలు జారీ చేసినట్లు ప్రచారం జరుగుతున్నది. హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్స్ నుంచి వచ్చే ప్రపోజల్స్‌ను సంబంధిత సెక్షన్ అధికారులు ఆయా శాఖల సెక్రటరీలకు పంపుతుంటారు. ఆ ప్రపోజల్స్‌ను ఆమోదించడమో లేదా తిరస్కరించడమో చేయాలి. ఒకవేళ ఏదైనా అదనపు సమాచారం అవసరం ఉంటే తెప్పించుకుని, తుది నిర్ణయం తీసుకోవాలి. కానీ కొత్తగా వచ్చిన చిన్న బాస్ మాత్రం ప్రతి ఫైల్‌పై కొర్రీలు వేయడం పనిగా పెట్టుకుని, అధికారులను సతాయిస్తున్నట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరైనా ధైర్యం చేసి బిజినెస్ రూల్స్‌కు విరుద్ధంగా కొర్రీలు ఉన్నాయంటే ‘ఇక్కడ నా రూల్స్ మాత్రమే పాటించాలి. నేను చెప్పిందే చెయ్యాలి’ అని ఆదేశిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.

సెక్షన్‌లో చక్కర్లు, ర్యాక్స్‌ల్లో తనిఖీలు..

సెక్రటేరియట్‌లో పనిచేస్తోన్న సెక్రటరీలు తమకు కేటాయించిన చాంబర్‌లో కూర్చొని ఫైల్ చూస్తుంటారు. ఏదైనా అర్జెంట్ అయితే సంబంధిత సెక్షన్‌కు వెళ్లి అక్కడ ఉన్న అధికారులకు ఆదేశాలు ఇచ్చి వస్తుంటారు. కానీ చిన్న బాస్ మాత్రం రోజుకు రెండు, మూడుసార్లు సెక్షన్ల వద్దకు వెళ్లి అక్కడ పనిచేస్తోన్న ఉద్యోగులను ఉద్దేశించి ‘నేను చెప్పిన పని ఏమైంది? నేను చెప్పినట్లుగా మాత్రమే చెయ్యాలి’ అని సతాయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్కడ ఉన్న బీరువాలను తనిఖీ చేయడం, అక్కడ ఉన్న ఫైల్స్‌ను ఆరా తీయడం చేస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే ప్రతిరోజు ఆ విధంగా సెక్షన్‌కు వచ్చి వెళ్లడం వెనుక చిన్న బాస్ ఉద్దేశ్యం ఏంటి? అనే దానిపై ఉద్యోగులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

నేరుగా సెక్రటేరియట్ పోస్టింగ్‌తో కష్టాలు..

హెచ్‌ఓడీల్లో పనిచేసిన అనుభవం ఉన్న బ్యూరోక్రట్స్‌కే సెక్రటేరియట్‌లో పోస్టింగ్ ఇవ్వాలి. అప్పుడే సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్‌పై అవగాహన ఏర్పడి నిర్ణయాల్లో పారదర్శకత, వేగం ఉంటుంది. కానీ ఈ మధ్య చాలామందికి హెచ్‌ఓడీల్లో పనిచేసిన అనుభవం లేకున్నా నేరుగా సెక్రటేరియట్‌లో పోస్టింగ్స్ ఇవ్వడం వల్ల వివాదాలు మొదలువుతున్నాయి. ఇండస్ట్రీ శాఖలో కొత్తగా వచ్చిన చిన్న బాస్ తీరు, ఆయన సూటిపోటి మాటలతో విసిగిపోయిన కొందరు ఎంప్లాయీస్ లాంగ్ లీవ్స్‌కు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. అయితే ముందుగా ప్రధాన కార్యదర్శిని కలిసి డిపార్ట్‌మెంట్‌లోని పరిస్థితులను ఆయన దృష్టికి తీసుకెళ్లాలని, అప్పుడు కూడా మార్పు లేకపోతే సామూహిక సెలవులకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.

Next Story