బోరున ఏడ్చిన నటుడు జీవా

by Muthe.Rajitha |

నిర్మాత ఆర్.బి. చౌదరి మరణవార్త తట్టుకోలేక ఆయన కుమారుడు, నటుడు జీవా బోరున విలపించిన దృశ్యాలు అందరినీ కలిచివేస్తున్నాయి.

బోరున ఏడ్చిన నటుడు జీవా
X

దిశ, వెబ్ డెస్క్ : భారతీయ చలనచిత్ర పరిశ్రమలో, ముఖ్యంగా దక్షిణాది సినిమా రంగంలో ఒక శకాన్ని సృష్టించిన లెజెండరీ నిర్మాత ఆర్.బి. చౌదరి (R.B. Choudary) మరణవార్త పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మే 5న రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వచ్చిన సమాచారం సినీ లోకాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది. తన తండ్రి అకాల మరణవార్త తట్టుకోలేక ఆయన చిన్న కుమారుడు నటుడు జీవా బోరున విలపించిన దృశ్యాలు అందరినీ కలిచివేస్తున్నాయి. తన తండ్రిని తన రోల్ మోడల్‌గా భావించే జీవా.. ఫోన్లో మాట్లాడుతూ వెక్కి వెక్కి ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ (Super Good Films) బ్యానర్‌పై తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో సుమారు 100 కుటుంబ కథా చిత్రాలను నిర్మించి బంపర్ హిట్లు అందుకున్నారు. ఎంతో మంది దర్శకులను, నటీనటులను వెండితెరకు పరిచయం చేసిన గొప్ప వ్యక్తిగా పేరుగాంచారు. తెలుగులో సూర్యవంశం, రాజా, నువ్వు వస్తావని, స్నేహంకోసం, సుస్వాగతం, నిన్నే ప్రేమిస్తా, శీను, సింహరాశి, సంక్రాంతి, రచ్చ, గాడ్ ఫాదర్ వంటి చిత్రాలు సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ మీదనే వచ్చాయి. కేవలం పెద్ద హీరోలతోనే కాకుండా, కొత్తవారితో చిన్న సినిమాలు నిర్మించి వాటిని విజయవంతం చేయడంలో ఆయనది అందెవేసిన చేయి. ఆయన మరణం సినిమా ఇండస్ట్రీకి తీరని లోటని ఇండీస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు, తమిళ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆర్.బి. చౌదరికి నివాళులర్పిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.

Next Story