మెదక్ జిల్లాలో పెరుగుతున్న ఏసీబీ దాడులు

by Muthe.Rajitha |

మెదక్ జిల్లాలో అధికారుల అవినీతికి అడ్డుకట్ట వేయడానికి ఏసీబీ దాడులు ముమ్మరం చేస్తున్నారు.

మెదక్ జిల్లాలో పెరుగుతున్న ఏసీబీ దాడులు
X

దిశ, మెదక్ ప్రతినిధి: ప్రభుత్వ అధికారుల్లో లంచావతారులు పెరిగినా అజమాయిషీ చేయాల్సిన అధికారులు చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందుతున్నారు. ప్రభుత్వ శాఖలో ఫైల్ కదలాలంటే సంబంధిత శాఖ అధికారులు దర్జాగా డబ్బులు డిమాండ్ చేసినా పై అధికారులు పట్టించుకోవడం లేదు. దీనితో బాధితులు ఏసీబీ ని ఆశ్రయించి అవినీతి అధికారుల పని పడుతున్నారు. అలాంటిదే జిల్లా వైద్య శాఖల్లో జరిగింది. మెడికల్ రియాంబర్స్ మెంట్ బిల్లుల మంజూరులో ఉద్యోగుల వద్ద భారీగా డిమాండ్ చేసి లక్షలు కాజేసిన అవినీతి అధికారిపై బాధితులు ఏసీబీ ని ఆశ్రయించడం తో సదరు అధికారి అవినీతి వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఏసీబీ వచ్చే వరకు సంబంధిత శాఖ బాస్ లు ఎందుకు నిశ్శబ్దంగా ఉంటున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సొంత శాఖలో అవినీతి జరుగుతున్న దృష్టికి ఎందుకు రావడం లేదన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ రియింబర్స్ మెంట్ సూపరింటెండెంట్ లతీఫ్ ముజాహిద్దీన్ పై ఏసీబీ తనిఖీలు వేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తూ మెడికల్ రియింబర్స్ మెంట్ బిల్లుల మంజూరులో నిబంధనలు పాటించకుండా అవినీతికి పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదు తో ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో తనిఖీలు చేసి పలు కీలక వివరాలు గుర్తించారు. సూపరింటెండెంట్ లతీఫ్ ముజాహిద్దీన్ నిబంధనల ప్రకారం చేయడం లేదని, ఇన్వార్డ్ లో ఎంట్రీ మినహా ఔట్ పాస్ వివరాలు లేకపోవడం పై అధికారులు అనుమానం వ్యక్తం వేశారు. దీనితో సదరు అధికారి వద్దకు వచ్చిన బిల్లుల వివరాలు సమగ్రంగా సేకరించి సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు పూర్తి నివేదిక అందిస్తామని వెల్లడించిన విషయం తెలిసిందే.

కాసుల లెక్క తేలితేనే ఫైల్ లో కదలిక..

మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ రియంబర్స్ మెంట్ మంజూరులో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్టు ప్రచారం సాగుతుంది. జిల్లా ఆసుపత్రిలో రూ 50 వేల లోపు మెడికల్ బిల్స్ ఉన్న వాటికి మాత్రమే మెడికల్ రియంబర్స్ మెంట్ మంజూరు చేస్తారు. దీనితో ఆసుపత్రుల్లో చికిత్స పొంది బిల్లులు చెల్లించిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు మెడికల్ రియంబర్స్ మెంట్ కు దరఖాస్తు చేసుకుంటారు. పక్కా బిల్లులతో వచ్చిన వారి ఆసుపత్రి లో ఇచ్చిన బిల్లులు పక్కగా ఉంటే మెడికల్ రియంబర్స్ మెంట్ మంజూరు చేయాల్సి ఉంటుంది. కానీ సదరు అధికారి అన్ని సక్రమంగా ఉన్నా లేని కొర్రీలు పెట్టీ రూ 5 వేలు, 10 వేలు బిల్లులు మంజూరు చేయడం తో చాలా వరకు నష్టపోయారు. కానీ బిల్లుపై ఇంత పర్సెంజ్ ఇచ్చిన వారికి మాత్రం ఎలాంటి కొర్రీలు లేకుండా బిల్లులు మంజూరు చేయడం లో ఆ అధికారి దిట్టగా మారాడు. దీనితో ఎవరైనా సరే ముందుగా బిల్లుపై పర్సంటేజ్ కుదుర్చుకుంటేనే బిల్లులు వస్తాయన్న ప్రచారం స్థానికంగా సాగింది. దీనితో చేసేది ఏమీలేక అడిగింత ఇచ్చి బిల్లులు చేయించుకోవడం తో ఇక్కడ మామూళ్లు సాధారణంగా మారిపోయినట్లు బాధిత ఉద్యోగులు వాపోతున్నారు. దీనితో లక్షల్లో చేతులు మారినట్టు ప్రచారం సాగింది. ఆ అవినీతి అధికారి పాపం పండడంతో విషయం ఏసీబీ అధికారుల వద్దకు వెళ్ళి తనిఖీల వరకు వచ్చిన సంగతి తెలిసిందే.

బాస్ లు ఏం చేస్తున్నట్టు..

మెదక్ జిల్లాలో ఇటీవల కాలంలో ఏసీబీ దాడులు హడలెత్తిస్తున్న అధికారుల్లో అవినీతి ఏ మాత్రం తగ్గడం లేదు. గతంలో వైద్య శాఖలో అనుమతుల కోసం వేస్తే డబ్బులు డిమాండ్ చేయడం తో ఏసీబీ కి చిక్కిన ఘటన మరవకముందే ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో మెడికల్ రియంబర్స్ మెంట్ బిల్లుల మంజూరులో డబ్బులు డిమాండ్ చేసినట్టు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంతో సూపరింటెండెంట్ పై ఏసీబీ తనిఖీలు జరిగాయి. మెదక్ ట్రాన్స్ కో డీఈ ఫౌల్ట్రీ ఫారం వద్ద ట్రాన్స్ ఫార్మర్ కోసం డబ్బులు డిమాండ్ చేయడం తో ఏసీబీ కి చిక్కి జైలు పాలయ్యాడు. రెవెన్యూ, ల్యాండ్స్ సర్వే శాఖ, ఫారెస్ట్, మున్సిపల్ ఎలా అనేక శాఖల్లో డబ్బులు తీసుకుంటూ ప్రభుత్వ అధికారులు ఏసీబీ కి పట్టుబడిన విషయం తెలిసిందే. కానీ జిల్లా స్థాయి అధికారుల వైఫల్యం వల్లనే జిల్లాలో అవినీతి పెరిగేందుకు కారణంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ శాఖ లో అవినీతి అధికారిపై ఫిర్యాదు చేసిన వెంటనే విచారణ జరిపి పద్దతి మార్చేలా చర్యలు తీసుకుంటే జిల్లాలో ఏసీబీ దాడుల వరకు వెళ్లే అవకాశం ఉండదు. కానీ ఆవు చేనులో మేస్తే దూడ గట్టు మీద మేస్తుందా అనే చందంగా జిల్లా స్థాయి అధికారులే ఏసీబీ కకిచిక్కుతుంటే కింది స్థాయి లో అవినీతి ఉండకుండా ఎలా ఉంటుందన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. జిల్లాలోని ఏదైనా శాఖలో అవినీతి పాల్పడుతున్నట్టు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చిన వెంటనే అదుపు చేసేందుకు చర్యలు తీసుకుంటే జిల్లాలో ఏసీబీ దాడులతో పాటు అవినీతి తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది.

Next Story