- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంతులేకుండా పోతున్న అవినీతి.. ఎక్సైజ్ శాఖ పై ఏసీబీ నజర్!
జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ మల్లారెడ్డి కార్యాలయం, నివాసాలపై తనిఖీలు నిర్వహించిన ఎపిసోడ్ తర్వాత ఎక్సైజ్ శాఖ బండారం ఒక్కొక్కటిగా బయట పడుతోంది.

దిశ ప్రతినిధి, నిజామాబాద్: జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ మల్లారెడ్డి కార్యాలయం, నివాసాలపై తనిఖీలు నిర్వహించిన ఎపిసోడ్ తర్వాత ఎక్సైజ్ శాఖ బండారం ఒక్కొక్కటిగా బయట పడుతోంది. ఎక్సైజ్ అధికారులు కల్లు వ్యాపారులు, మద్యం షాపులు, బెల్ట్ షాపులు, కల్లు డిపోల నిర్వాహకుల నుంచి వసూళ్లు చేసే నెలవారీ చిట్టా తెలిపే డైరీ బయట పడటంతో ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది భయం గుప్పిట్లో పని చేస్తున్నారు. ఏసీబీ అధికారుల కన్ను మళ్లీ ఎవరి పై పడనుందో, తమలో ఎవరిని టార్గెట్ చేస్తారోననే ఆందోళన అటు అధికారుల్లో, ఇటు సిబ్బందిలోనూ కనిపిస్తుంది. ఎందుకంటే, ఏసీబీ నజర్ కేవలం మల్లారెడ్డితోనే ఆగిపోలేదని, ఇంకా పలువురు ఏసీబీ నజర్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం పైనే ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఉమ్మడి జిల్లాలోని పలువురు ఎక్సైజ్ ఎస్ఐ, సీఐ లపై ఆ శాఖ ఉన్నతాధికారులతో పాటు ఏసీబీ కి కూడా ఫిర్యాదులందినట్లు సమాచారం. ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా ఉన్నతాధికారుల వైపు నుండి సరైన రీతిలో స్పందన లేకపోవడంతో నిరాశతో ఏసీబీ అధికారులను ఫోన్ ద్వారా ఉప్పందిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. మల్లారెడ్డి ఎపిసోడ్, ఆ వెనువెంటనే లంచాల డైరీ బయట పడ్డ అంశం ఎక్సైజ్ శాఖ పరువు తీసి నడిరోడ్డుపై నిలబెట్టినట్లయ్యింది. జిల్లాలోని దాదాపు అన్ని ఎక్సైజ్ ఎస్ హెచ్ ఓ పరిధిలోని మండలాల్లో అక్రమ వసూళ్లు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అధికారులు నేరుగా కాకుండా సిబ్బంది ద్వారానో, లేదంటే మద్యం వ్యాపారులు, సొసైటీ ప్రతినిధులతోనో ముడుపులు స్వీకరిస్తున్నట్లు తెలుస్తోంది. సిబ్బంది మధ్యవర్తిత్వం ముడుపులు స్వీకరిస్తున్న అధికారులు, సిబ్బందికి నామమాత్రంగా కూడా ముడుపుల్లో వాటాలు ఇవ్వడం లేదని, వ్యాపారుల నుంచి తీసుకొచ్చిన డబ్బులన్నీ వారే తీసేసుకుంటున్నారనే అసంతృప్తి సిబ్బందిలో ఉన్నట్లు తెలుస్తోంది.
పైగా శాఖ పరంగా కూడా ఎలాంటి సహకారాన్ని అందించడం లేదనే అభిప్రాయంతో సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ఎస్ హెచ్ ఓ స్థాయి అధికారికి కూడా ఎవరి నుంచి ఎంతెంత ముడుపులు వసూళ్లు చేస్తారో డైరీ రాసుకునే అలవాటుందని, డైరీలో అందరి పేర్లు రాసుకుని ఎవరి నుండి ముడుపులు అందకపోయినా, వారికి ఫోన్ లు చేసి సిబ్బందిని వారి వద్దకు పంపి తెప్పించుకునే అలవాటున్న ఆఫీసర్లు కూడా కొందరు ఎక్సైజ్ శాఖలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాంటి వారిపైనే ఏసీబీ ప్రత్యేకంగా దృష్టి పెట్టిందనే టాక్ వినిపిస్తోంది. ఎక్సైజ్ పై మరోమారు ఏసీబీ రైడ్ ఉంటుందేమోననే అనుమానాలు ఎక్సైజ్ శాఖలో సిబ్బందిని, అధికారులను వేధిస్తున్నాయని చర్చించుకుంటున్నారు.
ఎక్సైజ్ శాఖలో సిబ్బందితోనే ఇబ్బందులా?
ఎక్సైజ్ శాఖలో డ్యూటీల విషయంలో నిక్కచ్చిగా ఉండే ఆఫీసర్ల పై కొందరు సిబ్బంది పని గట్టుకుని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారనే ఆవేదన కొందరు అధికారుల్లో క(వి)నిపిస్తోంది. ఆడిందే ఆటగా పాడిందే పాట గా పని చేసే కొందరు సిబ్బంది కావాలనే అధికారులను ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సొంత శాఖలో అలాంటి సిబ్బందితోనే కొందరు అధికారులకు ఇబ్బందులెదురవుతున్నాయని ఓ ఆఫీసర్ తన తోటి అధికారులతో వాపోయినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని పలుమార్లు తన పై అధికారులకు కూడా విన్నవించినట్లు సమాచారం.
ఈత చెట్లే లేవు.. కల్లు ఇంతగా అమ్మకాలెలా ?
జిల్లాలో తెల్ల కల్లు వినియోగానికి తగ్గట్లుగా ఈత చెట్ల సంఖ్య లేకపోయినా, కల్లు అమ్మకాలు గణనీయంగా జరుగుతున్న తీరుపై ఎక్సైజ్ శాఖ మినహా మిగతా అందరినీ విస్మయానికి గురి చేసే అంశమే. ఎందుకంటే, జిల్లాలో ఎక్కడ చూసినా తెల్ల కల్లు సీసాలు వాటర్ బాటిళ్లలా అమ్ముడవుతున్నాయి. జిల్లాలోని ఈత చెట్ల సంఖ్యకు, వాటినుండి తయారయ్యే కల్లుకు ఎక్కడ పొంతనే ఉండదు. కానీ, జిల్లాలో ఇబ్బడి ముబ్బడిగా కల్లు అమ్మకాలు జరుగుతున్నాయి. జిల్లాలో అమ్ముడయ్యే కల్లు లో దాదాపు 70 శాతం కల్తీ కల్లే అనేది బహిరంగ రహస్యమే. గుల్ ఫారం కల్లుగా పిలవబడే ఈ కల్లులో క్లోరల్ హైడ్రేట్ వంటి ప్రమాదకర రసాయనాలను మోతాదుకు మించి కలిపి కృత్రిమంగా కల్లును తయారు చేసి కల్లు ప్రియులకు దర్జాగా అమ్ముతున్నారు.
ఇది ఎక్సైజ్ చట్టానికి విరుద్ధంగా కొనసాగుతున్న అక్రమ దందా. ఈ దందాను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నడిపించుకోవటానికి వ్యాపారులు ఎక్సైజ్ అధికారులకు, సిబ్బందికి వారి వారి స్థాయిని బట్టి ముడుపులు చెల్లించి తమ దందాను ఆటంకం లేకుండా నిర్వహిస్తున్నారు. లైసెన్స్డ్ మద్యం షాపుల నిర్వాహకులు తమ అమ్మకాలను భారీగా పెంచుకోవడానికి నిబంధనలకు విరుద్ధంగా జిల్లాలో దాదాపు గ్రామ గ్రామాన బెల్టు షాపులు నడిపిస్తున్నారు. ఇవన్నీ కూడా ఎక్సైజ్ శాఖ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నా ఎవరిమీదా ఎలాంటి చర్యలు లేకుండా సాఫీగా కొనసాగడం వెనక మామూళ్ల భాగోతమే నడుస్తోందన్నది అందరికీ తెలిసిన విషయమే. వాటిపై ఏసీబీ దృష్టి సారించడంతో ఏసీబీ చర్యలు మల్లారెడ్డితోనే ఆగిపోవని, మరి కొందరిపై ఏసీబీ కొరడా ఝులిపించడం ఖాయమనే టాక్ బాగా వినిపిస్తోంది. మరి కొద్ది రోజుల్లో ఏం జరుగుతుందోననే టెన్షన్ మాత్రం ఎక్సైజ్ అధికారుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.






