టీజీఆర్‌ఈడీసీఓ డిప్యూటీ ఇంజినీర్ ఆస్తులపై ఏసీబీ మెరుపు దాడులు

by Jakkula.Mamatha |

తెలంగాణ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు టీజీఆర్‌ఈడీసీఓ డిప్యూటీ ఇంజినీర్ ముత్యం వెంకటరమణకు సంబంధించిన ఆస్తులపై బుధవారం విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహించారు.

టీజీఆర్‌ఈడీసీఓ డిప్యూటీ ఇంజినీర్ ఆస్తులపై ఏసీబీ మెరుపు దాడులు
X

దిశ, పాల్వంచ టౌన్: తెలంగాణ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు టీజీఆర్‌ఈడీసీఓ డిప్యూటీ ఇంజినీర్ ముత్యం వెంకటరమణకు సంబంధించిన ఆస్తులపై బుధవారం విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా పది ప్రాంతాల్లో ఏకకాలంలో చేపట్టిన ఈ దాడుల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని రాహుల్ గాంధీ నగర్‌లో ఉన్న ఆయన బంధువుల నివాసాల్లోనూ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఖమ్మం ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు ఉదయం నుంచే సోదాలు ప్రారంభించి ఆస్తులకు సంబంధించిన పత్రాలు, బ్యాంకు ఖాతాలు, స్థిరాస్తులు, పెట్టుబడులు, ఇతర ఆర్థిక లావాదేవీల వివరాలను పరిశీలిస్తున్నాయి.

హైదరాబాద్ మాధాపూర్‌లోని అధికారిక నివాసంతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులకు సంబంధించిన పలు ప్రాంతాల్లో ఒకేసారి సోదాలు కొనసాగుతున్నాయి.విధుల నిర్వహణలో అక్రమాలకు పాల్పడుతూ కాంట్రాక్టు పనుల్లో కమిషన్లు వసూలు చేసి ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు డిప్యూటీ ఇంజినీర్‌పై ఆరోపణలు ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు అందిన ఫిర్యాదులపై ప్రాథమిక విచారణ చేపట్టిన ఏసీబీ అధికారులు తదుపరి పూర్తి స్థాయి సోదాలకు దిగినట్లు తెలిపారు. సోదాల సందర్భంగా భూములు, గృహాలు, బ్యాంకు డిపాజిట్లు, పెట్టుబడులు, ఇతర ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

లభ్యమవుతున్న ఆధారాల ఆధారంగా ఆస్తుల విలువ, వాటి మూలాలపై సమగ్ర విచారణ కొనసాగుతోంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో సమాంతరంగా కొనసాగుతున్న ఈ సోదాలు పూర్తయిన అనంతరం స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఇతర ఆధారాలపై విశ్లేషణ చేసి తదుపరి న్యాయపరమైన చర్యలు చేపట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. సోదాలు కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

Next Story