బీసీ హాస్టళ్లలో 'అకడమిక్ ప్రొఫైల్'.. విద్యార్థులకు హెల్త్ రికార్డులు!

by Muthe.Rajitha |

బీసీ సంక్షేమ హాస్టళ్లు పునఃప్రారంభమైన వెంటనే విద్యార్థులకు ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.

బీసీ హాస్టళ్లలో అకడమిక్ ప్రొఫైల్.. విద్యార్థులకు హెల్త్ రికార్డులు!
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీసీ సంక్షేమ హాస్టళ్లు పునఃప్రారంభమైన వెంటనే విద్యార్థులకు ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని, యూనిఫారాలు, పాఠ్యపుస్తకాలు, షూస్ తదితర సామాగ్రి పంపిణీ సజావుగా జరగాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ప్రతి విద్యార్థికి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, వారి కోసం ప్రత్యేకంగా 'వ్యక్తిగత ఆరోగ్య రికార్డులు' సిద్ధం చేయాలన్నారు. హాస్టళ్లలో ఏడాది పొడవునా నిర్వహించాల్సిన విద్యా, సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలతో కూడిన 'అకడమిక్ ప్రొఫైల్'ను రూపొందించాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రత, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ఆదివారం మినిస్టర్ క్వార్టర్స్‌లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్టళ్ల నిర్వహణ, విద్యా ప్రమాణాల పెంపు, ఉద్యోగ శిక్షణపై అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు.

విద్యార్థుల సంఖ్య పెరగాలి..

పదో తరగతిలో ఈ విద్యా సంవత్సరంలో 500కు పైగా మార్కులు సాధించే విద్యార్థుల సంఖ్యను పెంచేలా కార్యాచరణ రూపొందించాలని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. బీసీ గురుకులాల్లో ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్థుల సంఖ్య పెంపుపై చర్యలు చేపట్టాలన్నారు. రాబోయే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లను దృష్టిలో ఉంచుకుని నిరుద్యోగులకు అండగా నిలవాలని సూచించారు. రాష్ట్రంలోని 12 బీసీ స్టడీ సర్కిళ్లలో ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు. ఫౌండేషన్ కోర్సులు, కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలను ఏడాది పొడవునా నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల కోసం త్వరలోనే దీర్ఘకాలిక శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బీసీల ఆత్మగౌరవానికి ప్రతీకలైన ఆత్మగౌరవ భవనాల నిర్మాణ పురోగతిపై కూడా ఈ సమావేశంలో మంత్రి చర్చించారు. ఈ సమీక్షా సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బాలమాయాదేవి, బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య బట్టు, ఎంబీసీ కార్పొరేషన్ ఎండీ అలోక్ కుమార్, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, వడ్డెర ఫెడరేషన్ ఎండీ శ్రీనివాస్ రెడ్డి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story