- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీతారామ ప్రాజెక్టు పూర్తికి నిర్దిష్ట గడువు ప్రకటించాలి : సీపీఐ నేత హేమంతరావు
ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమవడంతో పాటు రైతులకు సంబంధించిన సంక్షేమ పథకాలను సంపూర్ణంగా అమలు చేయకపోవడం వల్ల రైతుల్లో ప్రభుత్వం పై విశ్వసనీయత క్రమంగా సన్నగిల్లుతోందని సీపీఐ నేత, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు హేమంతరావు అన్నారు.

దిశ, ఖమ్మం టౌన్ : ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమవడంతో పాటు రైతులకు సంబంధించిన సంక్షేమ పథకాలను సంపూర్ణంగా అమలు చేయకపోవడం వల్ల రైతుల్లో ప్రభుత్వం పై విశ్వసనీయత క్రమంగా సన్నగిల్లుతోందని సీపీఐ నేత, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు హేమంతరావు అన్నారు. రైతుల్లో నెలకొన్న అసంతృప్తి ఆగ్రహంగా మారకముందే రైతులకు సంబంధించిన అన్ని పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయడంతో పాటు, ఖమ్మం జిల్లాలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సీతారామ ప్రాజెక్టును ఎప్పటిలోగా పూర్తి చేస్తారో ముఖ్యమంత్రి రైతు ఆశీర్వాద సభ సందర్భంగా స్పష్టంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. శనివారం స్థానిక సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హేమంతరావు మాట్లాడుతూ, ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులకు గోదావరి జలాలను అందించేందుకు సీపీఐ అనేక చారిత్రక పోరాటాలు నిర్వహించిందని గుర్తుచేశారు. కమ్యూనిస్టుల పోరాట ఫలితంగానే దుమ్ముగూడెం ప్రాజెక్టు ప్రారంభమైందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం అదే సీతారామ ప్రాజెక్టుగా రూపాంతరం చెందిందన్నారు.
రూ.11,300 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన సీతారామ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం దశలవారీగా పెరిగి ప్రస్తుతం రూ.19,365 కోట్లకు చేరిందని తెలిపారు. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ ప్రాజెక్టు మాత్రం పూర్తి కాలేదని విమర్శించారు. కొన్ని ప్యాకేజీల్లో పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదని, పంటకాలువల తవ్వకాల కోసం ఇటీవలే టెండర్లు పూర్తి చేశారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూడు బడ్జెట్లలో కలిపి రూ.1,000 కోట్లు కూడా సీతారామ ప్రాజెక్టుపై ఖర్చు చేయలేదని ఆరోపించారు. ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో నిధులు కేటాయించి, ఎలాంటి జాప్యం లేకుండా పనులు పూర్తి చేసి ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని సీపీఐ ఖమ్మం జిల్లా సమితి తరఫున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. లింక్ కెనాల్లపై చూపుతున్న శ్రద్ధ సీతారామ ప్రాజెక్టుపై స్థానిక మంత్రులు చూపడం లేదని విమర్శించారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ, పంటల బీమా వంటి అంశాల్లో ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడంతో రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని హేమంతరావు అన్నారు.
రుణమాఫీకి సంబంధించి విడుదల చేసిన జీవోలో రూ.2 లక్షలకు మించిన రుణాలు ఉన్న రైతుల రుణాలను కూడా మాఫీ చేస్తామని పేర్కొన్నప్పటికీ, ఆ హామీ ఎందుకు అమలు కాలేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా పథకాన్ని ఇప్పటికే రెండు సార్లు పూర్తిస్థాయిలో అమలు చేయకుండా, గత రబీ సీజన్‌లో కేవలం రెండు ఎకరాల వరకు మాత్రమే పరిమితం చేశారని విమర్శించారు. రైతు ఆశీర్వాద సభలో అర్హత కలిగిన ప్రతి రైతుకూ రైతు భరోసా పూర్తిస్థాయిలో అందిస్తేనే అది నిజమైన ఆశీర్వాద సభ అవుతుందని అన్నారు. రైతు భరోసా పై ఇప్పటికీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో, ఇకనైనా అర్హులైన రైతులందరికీ పూర్తిస్థాయిలో అందిస్తుందా అనే అనుమానం రైతుల్లో నెలకొందన్నారు. దేవుళ్లపై ప్రమాణం చేసి ఇచ్చిన హామీలను ప్రభుత్వం పూర్తిగా అమలు చేయాలని కోరారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ పంటల బీమా లేకుండా వ్యవసాయం కొనసాగడం లేదని పేర్కొంటూ, తెలంగాణలో కూడా పంటల బీమా పథకాన్ని తక్షణమే ప్రకటించాలని హేమంతరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.






