మద్యం సీసాలో అట్ట ముక్క..!

by Ratna Kumari |   (  Updated:2026-07-23 12:31:11  IST  )

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని ఓ వైన్స్ షాపులో కొనుగోలు చేసిన ఐబీ (ఇంపీరియల్ బ్లూ) మద్యం సీసాలో అట్ట ముక్క కనిపించడంతో కొనుగోలుదారుడు ఆశ్చర్యానికి గురయ్యాడు.

మద్యం సీసాలో అట్ట ముక్క..!
X

దిశ, మరిపెడ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని ఓ వైన్స్ షాపులో కొనుగోలు చేసిన ఐబీ (ఇంపీరియల్ బ్లూ) మద్యం సీసాలో అట్ట ముక్క కనిపించడంతో కొనుగోలుదారుడు ఆశ్చర్యానికి గురయ్యాడు. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికులు, కొనుగోలుదారుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం అజ్మీర్ తండాకు చెందిన బోడ నవీన్ ఓ శుభకార్యానికి మరిపెడకు వచ్చాడు. మిత్రులతో కలిసి స్థానిక ఏడుకొండలు వైన్స్ లో ఐబీ హాఫ్ బాటిల్ కొనుగోలు చేశాడు. అనంతరం బాటిల్‌లో అట్ట ముక్క ఉన్నట్లు గుర్తించి వైన్స్ సిబ్బందిని ప్రశ్నించగా, వారి స్పందన పట్ల అసంతృప్తి చెందిన నవీన్ ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశాడు.

ఎక్సైజ్ అధికారుల తనిఖీ..

ఫిర్యాదు అందుకున్న ఎక్సైజ్ ఎస్‌ఐ రవళి వెంటనే వైన్స్ షాపుకు చేరుకుని సంబంధిత బ్యాచ్‌కు చెందిన స్టాక్‌ను పరిశీలించారు. మరో బాటిల్‌ను తెరచి మద్యం నమూనాలను ప్రాథమికంగా పరీక్షించారు. ప్రాథమిక పరీక్షల్లో మద్యంలో ఎలాంటి కల్తీ ఆనవాళ్లు లేవని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అయితే పూర్తి నిర్ధారణ కోసం సంబంధిత నమూనాలను ప్రయోగశాలకు (ల్యాబ్) పంపించినట్లు, సుమారు 15 రోజుల్లో నివేదిక వచ్చిన అనంతరం ఉన్నతాధికారులకు సమర్పిస్తామని ఎస్‌ఐ రవళి తెలిపారు.

తయారీ సమయంలోనే అట్ట చేరి ఉండొచ్చన్న అనుమానం..

మద్యం సీసాలో అట్ట ముక్క ఎలా చేరిందన్న ప్రశ్నకు స్పందించిన ఎక్సైజ్ ఎస్‌ఐ రవళి, తయారీ సంస్థ రీ-యూజ్డ్ గాజు సీసాలను వినియోగించే సమయంలో వాటిని సరిగా శుభ్రం చేయకపోవడం వల్ల అట్ట ముక్క లోపలికి వెళ్లి ఉండే అవకాశం ఉందని ప్రాథమికంగా భావిస్తున్నట్లు తెలిపారు. దీనిపై తుది స్పష్టత ల్యాబ్ నివేదిక వచ్చిన అనంత‌రం తెలుస్తుందని తెలిపారు. మరోవైపు, వైన్స్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు తయారీ సంస్థ నిర్లక్ష్యంపైనా న్యాయపరంగా చర్యలు తీసుకుంటానని కొనుగోలుదారుడు బోడ నవీన్ తెలిపారు.

Next Story