చినుకు పడితే చిత్తడి.. గేటు పడితే అరగంట నిరీక్షణ!

by Jakkula.Mamatha |

జిల్లాకే గుండెకాయ వంటి కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లే ప్రధాన రోడ్ల పరిస్థితి దయనీయంగా మారింది.

చినుకు పడితే చిత్తడి.. గేటు పడితే అరగంట నిరీక్షణ!
X

దిశ, కామారెడ్డి టౌన్: జిల్లాకే గుండెకాయ వంటి కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లే ప్రధాన రోడ్ల పరిస్థితి దయనీయంగా మారింది. ఏళ్లుగా రోడ్ల విస్తరణ, మరమ్మతులు కాగితాలకే పరిమితమవడంతో సామాన్య ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పాత బస్టాండ్ - అడ్లూరు కలెక్టరేట్ రోడ్డు దుస్థితి

పాత బస్టాండ్ నుంచి అడ్లూరు కలెక్టరేట్‌కు వెళ్లే ప్రధాన రహదారిలోని పంచముఖి హనుమాన్ మందిరం వద్ద బ్రిడ్జి నిర్మించారు. రోడ్డు విస్తరణ కోసమని ప్రస్తుత కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ఇంటిని కూడా కూల్చివేశారు. కొలతలు వేసి హడావిడి చేశారు. కానీ ఆ తర్వాత పనులు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. ఇరుకు రోడ్డు, గుంతలతో ప్రయాణం నరకంగా మారింది. చిన్న వర్షం పడిన రోడ్డంతా బురదమయమవుతోంది. కలెక్టరేట్‌కు వచ్చే సామాన్యులు, రైతులు, దరఖాస్తుదారులు రోజూ ఈ అవస్థలు పడుతూనే ఉన్నారు.

కొత్త బస్టాండ్ - అశోక్ నగర్ రోడ్డులోనూ ఇదే పరిస్థితి

కొత్త బస్టాండ్ నుంచి అశోక్ నగర్ మీదుగా రైల్వే గేటు వరకు వెళ్లే రోడ్డు కూడా శిథిలావస్థలో ఉంది. చిన్నపాటి వర్షానికే మోకాళ్ల లోతు నీరు నిలుస్తోంది. అదే రోడ్డుపై రైల్వే గేటు ఉండడంతో గేటు పడితే కనీసం అరగంట సేపు వాహనాలు నిలిచిపోతున్నాయి. ఏళ్ల తరబడిగా ఒకే రైల్వే బ్రిడ్జిపై ఆధారపడుతుండడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది.

ప్రజాప్రతినిధులు, అధికారులకు మాత్రం వేరే దారి

ప్రజాప్రతినిధులు, అధికారులు కలెక్టరేట్‌కు వెళ్లేందుకు ఈ రెండు రోడ్లను దాదాపుగా ఉపయోగించడం లేదు. వారు జాతీయ రహదారి 44ను ఆశ్రయిస్తున్నారు. దూరమైనా, చుట్టూ తిరగాల్సి వచ్చినా ఆ రోడ్డునే ఎంచుకుంటున్నారు. కానీ సామాన్యుడికి మాత్రం ఆ అవకాశం లేదు. పెట్రోలు, డీజిల్ ఖర్చు, ఆటో-బస్సు చార్జీలు, సమయం వృథా అవుతుందనే భయంతో ఇదే ఇరుకు, గుంతల రోడ్లను వాడుకోవాల్సి వస్తోంది.

ప్రజల ఆవేదన..

ఏళ్లుగా ఒకే రైల్వే బ్రిడ్జి పై ఆధారపడటం, రోడ్ల విస్తరణ పనులు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే స్పందించి పాత బస్టాండ్-అడ్లూరు, కొత్త బస్టాండ్-అశోక్ నగర్ రోడ్లను విస్తరించి, గుంతలు పూడ్చి సాఫీగా ప్రయాణం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి చర్యలు చేపడతారా..? లేదా..? అనేది వేచి చూడాలి.

Next Story