- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్పగింతల్లో భోరుమన్న వరుడు
ఛత్తీస్‌గఢ్‌లోని సుపల్గాలో ఓ వివాహానంతర బారాత్ లో వధువుకు బదులుగా వరుడు వెక్కి వెక్కి ఏడవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా పెళ్లి వేడుకల్లో అప్పగింతల సమయం వచ్చిందంటే చాలు.. పుట్టింటిని వదిలి వెళ్తున్నాననే బాధతో వధువు కంటతడి పెట్టడం మనం చూస్తుంటాం. కానీ, ఛత్తీస్‌గఢ్‌లోని సుపల్గాలో జరిగిన ఒక వివాహ వేడుక ఇందుకు పూర్తి భిన్నంగా సాగింది. ఇక్కడ వధువుకు బదులుగా వరుడు వెక్కి వెక్కి ఏడవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనికి కారణం ఆ యువకుడు పెళ్లి తర్వాత తన అత్తగారి ఇంటికి 'ఇల్లరికం' వెళ్తుండటమే. ఈ వినూత్న వివాహానికి సంబంధించి ఆసక్తికర వివరాలు.. ఛత్తీస్‌గఢ్‌లోని సుపల్గా అనే గ్రామంలో వధువు తండ్రి మోహన్‌కు నలుగురు కుమార్తెలు కాగా, మగ సంతానం లేదు. తన తదనంతరం కుటుంబ బాధ్యతలు చూసుకోవడానికి, తోడుగా ఉండటానికి ఒక కుమారుడు లేడనే వెలితి ఆయనను వేధించింది. దీంతో తన కుమార్తె వివాహం నిశ్చయమైనప్పుడే వరుడి కుటుంబం ముందు ఆయన ఒక ప్రతిపాదన పెట్టారు.
పెళ్లి తర్వాత తన అల్లుడు ఇల్లరికం రావాలని కోరారు. ఇందుకు వరుడి తరపు వారు కూడా సానుకూలంగా స్పందించారు. సాధారణంగా వరుడు బారాత్‌తో వధువు ఇంటికి వస్తాడు, కానీ ఇక్కడ వధువే ఊరేగింపుతో వరుడి ఇంటికి వెళ్లి అతడిని వివాహం చేసుకుంది. అనంతరం జరిగిన అప్పగింతల తంతులో వరుడు తన తల్లిదండ్రులను, పుట్టిన ఇంటిని వదిలి వెళ్తున్నాననే ఉద్వేగంతో కంటతడి పెట్టాడు. ఈ దృశ్యం చూసిన అతిథులు తొలుత ఆశ్చర్యపోయినా, ఆ తర్వాత ఆ యువకుడి మనసును అర్థం చేసుకుని అభినందించారు. తన అల్లుడిని కేవలం అల్లుడిలా కాకుండా, ఇంటికి కుమారుడిలా గౌరవ మర్యాదలతో చూసుకుంటామని వధువు తండ్రి మోహన్ భావోద్వేగంగా ప్రకటించారు.






