- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వ ఉద్యోగం అంటేనే ఓ భావోద్వేగం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ప్రాణాలకు తెగించి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు ఆశించారని, 2014 వరకు ఉద్యోగాల భర్తీ చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రాణాలకు తెగించి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు ఆశించారని, 2014 వరకు ఉద్యోగాల భర్తీ చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ నగరంలోని శిల్పకళా వేదికలో గ్రూప్-3 అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సొంత లాభమే చూసుకుందని, యువత, నిరుద్యోగులను పట్టించుకోలేదన్నారు. కుటుంబం, పార్టీ, రాజకీయ అవసరాలే ప్రధానంగా గత సర్కార్ పని చేసిందని ఆరోపించారు. వారి ఉద్యోగాలు ఊడితేనే ఉద్యోగాలు వస్తాయని యువత భావించి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని గుర్తు చేశారు. 14 ఏళ్ల పాటు గ్రూప్-1 పరీక్షలు నిర్వహించలేదని అన్నారు. పోటీ పరీక్షలు నిర్వహించకపోవడం బాధ్యతారాహిత్యమైతే.. పేపర్లు లీక్ అవ్వడం మరో బాధ్యతారాహిత్యమని ఫైర్ అయ్యారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ విశ్వసనీయతను కూడా దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల గ్రూప్-1 నియామక పత్రాలు ఇచ్చే సమయంలో కూడా కోర్టుకు వెళ్లి కుట్రలు చేశారని అన్నారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించామని తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగం అంటే ఓ భావోద్వేగం..
ఉద్యోగాలు ఇవ్వడం మాకు బాధ్యత..మీకు జీవితమంటూ సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగం అంటేనే జీతం తీసుకోవడం కాదు.. ఒక భావోద్వేగమని అన్నారు.అందరికీ విద్య అందుతోందని.. కానీ, నాణ్యమైన విద్య అందడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రైవేటు పాఠశాలల మీద ప్రజలకు ఎందుకు విశ్వాసం పెరిగిందని ప్రశ్నించారు. ఉచితంగా విద్యను అందజేస్తున్న ప్రభుత్వ పాఠశాలలకు ఎందుకు రావడం లేదని అన్నారు. నాణ్యమైన విద్యను అందిస్తే.. ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపిస్తారని కామెంట్ చేశారు. లక్షల మంది ఇంజినీరింగ్ చేసి బయటకు వస్తున్నా.. అందరికీ ఎందుకు ఉద్యోగాలు రావడం లేదని ప్రశ్నించారు. జాబ్ మార్కెట్‌లో అవకాశాలు ఉన్నా స్కిల్ లేక అందుకోలేకపోతున్నామని, నైపుణ్యాభివృద్ధి కోసం యువత ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. ఒకప్పుడు పేదరికం పోగొట్టుకోవడానికి భూములు ఇచ్చేవాళ్లమని.. ఇప్పుడు ఇవ్వడానికి భూములు లేవని, నైపుణ్యమైన విద్యను మాత్రమే అందించగలమని అన్నారు. విద్య ఒక్కటే పేదరికాన్ని పోగొడుతుందని, విద్యతోనే గౌరవమని తెలిపారు. కులం, డబ్బు, అధికారంతో గౌరవం రాదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.






