ప్రజల అశ్రునయనాల మధ్య ప్రజానేతకు తుది వీడ్కోలు

by Batti.Sumithra |

భువనగిరి మాజీ ఎమ్మెల్యే, సీనియర్ రాజకీయ నాయకుడు, ప్రజాసేవకుడు కొమ్మిడి నరసింహారెడ్డికి ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో బుధవారం ఘనంగా అంతిమ వీడ్కోలు పలికింది.

ప్రజల అశ్రునయనాల మధ్య ప్రజానేతకు తుది వీడ్కోలు
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : భువనగిరి మాజీ ఎమ్మెల్యే, సీనియర్ రాజకీయ నాయకుడు, ప్రజాసేవకుడు కొమ్మిడి నరసింహారెడ్డికి ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో బుధవారం ఘనంగా అంతిమ వీడ్కోలు పలికింది. బీబీనగర్ మండలంలోని ఆయన స్వగ్రామం బ్రాహ్మణపల్లిలో నిర్వహించిన అంత్యక్రియలకు ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అభిమానులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరై నివాళులర్పించారు. కొమ్మిడి నరసింహారెడ్డి మృతితో బ్రాహ్మణపల్లి గ్రామం విషాదంలో మునిగిపోయింది. గ్రామమంతా శోకఛాయలు అలుముకోగా, కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానుల రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. తమ అభిమాన నాయకుడిని చివరిసారిగా చూసేందుకు జిల్లా నలుమూలలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించి అశ్రునయనాలతో తుది వీడ్కోలు పలికారు. అంతిమయాత్రలో అడుగడుగునా ప్రజలు నివాళులర్పించగా బ్రాహ్మణపల్లి గ్రామం జనసంద్రమైంది. జీవితాంతం ప్రజల మధ్యే గడిపిన నాయకుడికి ప్రజల సమక్షంలోనే ఘనంగా అంతిమ వీడ్కోలు లభించింది. అంతకుముందు పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి పుష్పగుచ్ఛాలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ప్రజా జీవితంలో ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ, అందరికీ అందుబాటులో ఉండే నాయకుడిగా, భువనగిరి ప్రాంత అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన ప్రజానేతగా కొనియాడారు.

పలు ప్రాంతాల నుంచి వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై తుది నివాళులు అర్పించారు. ఆయన మృతితో భువనగిరి ప్రాంతం ప్రజలతో మమేకమైన నిరాడంబర నాయకుడిని కోల్పోయిందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ లు వెంకారెడ్డి, భువనగిరి ఆర్డీవో మాలి కృష్ణా రెడ్డిలు పాల్గొని పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాల ప్రకారం పోలీసు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ప్రభుత్వ గౌరవాలతో అంత్యక్రియలు నిర్వహించారు. బీబీనగర్ ఇన్‌స్పెక్టర్ ప్రభాకర్ రెడ్డి, ఎస్సైలు రమేష్, కృష్ణయ్య, తహసీల్దార్ శ్యాంసుందర్ రెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Next Story