రావణ్, ప్రకాశ్‌రాజ్‌లను వైసీపీ సమర్థించడం హిందూత్వంపై దాడే : విజయసాయి

by Naga Rani Yarlagadda |

దేశంలో హిందూ మతం, సనాతన ధర్మం, భారతీయ సంస్కృతిని విచ్ఛిన్నం చేసేందుకు పథకం ప్రకారం కుట్రలు జరుగుతున్నాయని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు.

రావణ్, ప్రకాశ్‌రాజ్‌లను వైసీపీ సమర్థించడం హిందూత్వంపై దాడే : విజయసాయి
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో హిందూ మతం, సనాతన ధర్మం, భారతీయ సంస్కృతిని విచ్ఛిన్నం చేసేందుకు పథకం ప్రకారం కుట్రలు జరుగుతున్నాయని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. అసలు ఈ రావణ్ లు, ప్రకాశ్ రాజ్ లు ఎక్కడి నుంచి పుట్టుకు వస్తున్నారు? వారికి మద్దతు ఇస్తున్నది ఎవరు? వీరు ఏ సంస్కృతికి వారసులు? వీరి మూలాలు ఎక్కడున్నాయి? అంటూ ఆయన ఎక్స్ వేదికగా వరుస ప్రశ్నలు సంధించారు. ఈ పరిణామాలపై తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ, దేశభక్తి ఉన్న హిందూ సోదరులంతా ఆలోచించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

కొన్ని వర్గాలు ఆర్థిక, రాజకీయ, అధికార లాభాల కోసం మతం మారినప్పటికీ.. తమ కులాల పేర్లను వదిలిపెట్టకుండా వాడుకుంటున్నారని విజయసాయిరెడ్డి విమర్శించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవ మతంలో పాస్టర్లుగా ఉన్నవారిలో సగానికి పైగా పాస్టర్లు మతం మార్చుకున్న ఓసీ సామాజిక వర్గాలకు చెందినవారేనని, వీరంతా వేరే మత వ్యవస్థల్ని నడిపిస్తూ లాభాలు పొందుతున్నారని ఆయన పేర్కొన్నారు. తెరవెనుక ఉండి మరికొందరితో దేశానికి, హిందూ మతానికి వ్యతిరేకంగా విషం కక్కించే కార్యక్రమాలను నడిపిస్తున్నారని ఆరోపించారు. ఇకపై భారతీయ సంస్కృతి, హిందూ దేవతలపై ఏదైనా కులం లేదా మతానికి చెందినవారైనా తప్పుడు వ్యాఖ్యలు చేస్తే.. చట్టం వారికి యావజ్జీవ కారాగార శిక్ష లేదా ఉరిశిక్ష విధించేలా ప్రభుత్వం చట్టాలను సవరించాలని డిమాండ్ చేశారు. అలాంటి వ్యాఖ్యల్ని సమర్థించేవారికి కూడా అదేస్థాయిలో గుణపాఠం చెప్పాలన్నారు.

వైసీపీ నేరుగా రావణ్ ను, ప్రకాశ్ రాజ్ ను సమర్థించడం, వారిని హైలైట్ చేయడమంటే.. నేరుగా హిందూత్వంపై, సనాతన ధర్మంపై దాడి చేయడమేనని విమర్శించారు. సూటు, బూటు, నల్లకళ్లద్దాలు ధరించి.. మైక్ పట్టుకుని సగం ఇంగ్లీషు, సగం తెలుగులో దేశ సార్వభౌమత్వంపై, సంస్కృతిపై నోటికొచ్చినట్లు మాట్లాడటం కొందరికి ఫ్యాషన్ గా, హీరోయిజంగా మారిందని మండిపడ్డారు. హైందవ, భారతీయ సమాజాన్ని విచ్ఛిన్నం చేసేలా ఉన్న ఈ ఆలోచనలను మతపరమైన ఉగ్రవాదంగా పరిగణించాలని, చట్టపరమైన శిక్షలతో పాటు సమాజం కూడా వారిని వెలివేయాలని పిలుపునిచ్చారు. ఈ తరహా దేశద్రోహ, సంఘ విద్రోహ కుట్రలపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతో పాటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా చేసిన పోస్టులో డిమాండ్ చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారానికి దారితీస్తున్నాయి.

Next Story