- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరోసారి ఆర్టీసీ జేఏసీ–యాజమాన్య చర్చలు విఫలం
ఆర్టీసీ ఉన్నతాధికారులు ఉద్యోగ సంఘాల జేఏసీతో నిర్వహించిన చర్చలు మరోసారి విఫలమయ్యాయి. విద్యుత్ బస్సుల నిర్వహణ, డిపోల పునఃప్రారంభం, టెండర్ల రద్దు తదితర కీలక డిమాండ్లపై ఆర్టీసీ యాజమాన్యంతో జేఏసీ నాయకులు బుధవారం రెండోసారి సమావేశమై చర్చించినప్పటికీ స్పష్టమైన నిర్ణయానికి రాలేకపోయారు...

దిశ, ఏపీ బ్యూరో: ఆర్టీసీ ఉన్నతాధికారులు ఉద్యోగ సంఘాల జేఏసీతో నిర్వహించిన చర్చలు మరోసారి విఫలమయ్యాయి. విద్యుత్ బస్సుల నిర్వహణ, డిపోల పునఃప్రారంభం, టెండర్ల రద్దు తదితర కీలక డిమాండ్లపై ఆర్టీసీ యాజమాన్యంతో జేఏసీ నాయకులు బుధవారం రెండోసారి సమావేశమై చర్చించినప్పటికీ స్పష్టమైన నిర్ణయానికి రాలేకపోయారు. జేఏసీ డిమాండ్లపై స్పష్టమైన లిఖితపూర్వక హామీ ఇవ్వకపోవడంతో చర్చలు ఫలించలేదని జేఏసీ కన్వీనర్లు వై. శ్రీనివాసరావు, పలిశెట్టి దామోదరరావు తెలిపారు. చర్చలు విఫలం నేపధ్యంలో జేఏసీ ఆందోళనపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆరా తీశారు. ఆర్టీసీ జేఏసీ లెవనెత్తిన సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు మంత్రి మండిపల్లి అధికారులకు స్పష్టం చేశారు.
ఎండీ ఆదేశాలతో..
ఆర్టీసీ వైఎస్ ఛైర్మన్, ఎండీ ఆదేశాలతో కె.ఎస్. బ్రహ్మానందరెడ్డి, జి.వి. రవివర్మ, గద్దె నాగేశ్వరరావు, ఫైనాన్స్ అడ్వైజర్ & చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ ఎన్. సుధాకర్ రావుతో పాటు ఇతర ఉన్నతాధికారులు బుధవారం ఆర్టీసీ హౌస్‌లో రెండోసారి జేఏసీ నేతలతో సమావేశమై చర్చించారు. చర్చల్లో భాగంగా విద్యుత్ బస్సుల నిర్వహణ కోసం మూసివేసిన విద్యాధరపురం, గుంటూరు-2, నెల్లూరు-2, మంగళం డిపోలను వెంటనే పునఃప్రారంభించాలని జేఏసీ ప్రధానంగా డిమాండ్ చేసింది. భవిష్యత్తులో వచ్చే అన్ని విద్యుత్ బస్సులను సంస్థే కొనుగోలు చేసి, పూర్తిగా ఆర్టీసీ ద్వారానే నిర్వహిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వాలని నేతలు కోరారు. విద్యుత్ బస్సుల పేరిట ఏ ఒక్క డిపోను ఖాళీ చేయరాదని, ప్రస్తుతం ఉన్న బస్సులు, సిబ్బందిని బదిలీ చేయకుండా చూడాలని, త్వరలో పిలవనున్న 1,450 విద్యుత్ బస్సుల టెండర్లను రద్దు చేస్తున్నట్లు స్పష్టమైన లిఖితపూర్వక హామీ ఇవ్వాలని జేఏసీ నాయకులు పట్టుబట్టారు. అయితే ఇవన్నీ ప్రభుత్వ పరిధిలోని అంశాలని పేర్కొన్న అధికారులు..ప్రభుత్వం ద`ష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. గత నెల 11న తామచ్చిన ఇతర డిమాండ్లను కూడా పరిష్కరించాలని వారు పట్టుబట్టారు. రానున్న రోజుల్లో స్పష్టమైన హామీతో వస్తేనే చర్చలకు వస్తామని పేర్కొంటూ మొక్కుబడి చర్చలతో ఉపయోగం లేదని అభిప్రాయపడ్డారు. చర్చల్లో జేఏసీ తరఫున కన్వీనర్లు వై. శ్రీనివాసరావు, పలిశెట్టి దామోదరరావు, కో-కన్వీనర్లు పి.వి. రమణారెడ్డి, జి.వి. నరసయ్య, ఎస్.కె. జిలానీ, సి.హెచ్. సుందరయ్య, ఎన్.వి. శేషగిరిరావు, కె. సూర్యప్రకాశ్ రావు, డి. మాల్యాద్రి తదితరులు హాజరయ్యారు. ఇదిలా ఉండగా రెండో దశలో భాగంగా రెండు రోజుల పాటు నిర్వహించిన ఆర్టీసీ పరిరక్షణ కార్యక్రమం విజయవంతమైనట్లు జేఏసీ నేతలు పేర్కొన్నారు. గురువారం నుంచి ఈ నెల 18 వరకు ప్రజాప్రతినిధులు ద`ష్టికి తీసుకెళ్లే కార్యక్రమం చేపడతామని తెలిపారు.
మంత్రి మండిపల్లి ఆరా..
మరోవైపు ఆర్టీసీ జేఏసీ చేపట్టిన ఆందోళనపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. ఆర్టీసీ ఈడీ కమిటీ సమావేశంలో జరిగిన చర్చల వివరాలను ఈడీ కె.ఎస్. బ్రహ్మానందరెడ్డి మంత్రి క్యాంపు కార్యాలయంలో వివరించారు. జేఏసీ డిమాండ్లు, వాటి ఆచరణ సాధ్యాసాధ్యాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆర్టీసీ ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, ఆర్టీసీ సేవలకు అంతరాయం కలగకుండా సమన్వయంతో చర్యలు కొనసాగించాలని మంత్రి సూచించారు. అలాగే సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గాలపై చర్చించనున్నట్లు మంత్రి మండిపల్లి అధికారులకు స్పష్టం చేశారు.






