శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ వరకూ ఈ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

by Naga Rani Yarlagadda |

జులై నుంచి సెప్టెంబర్ వరకూ కొన్ని తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.

శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ వరకూ ఈ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
X

దిశ, వెబ్‌డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే ఆ శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు ప్రతినిత్యం వేలాది మంది భక్తులు కొండకు చేరుకుంటుంటారు. టోకెన్ లేకుండా శ్రీవారి దర్శనం కావాలంటే గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి. అందుకే కొందరు తమకు తెలిసిన రాజకీయనేతలతో సిఫార్సు లెటర్లు తీసుకుని.. వీఐపీ బ్రేక్ దర్శనానికి వెళ్తుంటారు. అలాంటి భక్తులకు టీటీడీ కీలక సూచన చేసింది. సెప్టెంబర్ వరకూ కొన్ని తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. పండుగలు, ఉత్సవాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. భక్తులు ఇందుకు సహకరించాలని టీటీడీ కోరింది. ఆయా తేదీలకు ముందు రోజు తిరుమలలో ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా ఇంకెవ్వరి వీఐపీ సిఫార్సు లేఖలు తీసుకోబోమని తెలిపింది.

జులై 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 17న ఆణివార ఆస్థానం, 19న శ్రీ ఆండవన్ ఆశ్రమ స్వామీజీకి పెద్ద మర్యాద, 29న జీయర్ స్వాముల చాతుర్మాస సంకల్పం నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. అలాగే ఆగస్టు 22న పవిత్రోత్సవాలకు అంకురార్పణ, 24న పవిత్రోత్సవాల రెండోరోజు సందర్భంగా పవిత్రాల సమర్పణ, సెప్టెంబర్ 8న శ్రీవారి బ్రహ్మోత్సవాల కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 14న శ్రీవారి బ్రహ్మోత్సవాలు, సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకూ శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది.

Next Story