Stock Market: ఒక్కరోజులో రూ.8.56 లక్షల కోట్ల సంపద ఆవిరి

by S Gopi |

బుధవారం మధ్యాహ్నం వరకు లాభాల్లో కదలాడిన సూచీలు ఆ తర్వాత పతనమయ్యాయి. ముఖ్యంగా పెట్టుబడిదారులు ఈక్విటీల నుంచి నిష్క్రమించి సురక్షిత ఆస్తుల వైపు మొగ్గుచూపారు.

Stock Market: ఒక్కరోజులో రూ.8.56 లక్షల కోట్ల సంపద ఆవిరి
X

దిశ, బిజినెస్ బ్యూరో: మధ్యప్రాచ్యంలో మళ్లీ పెరిగిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల భారీ పెరుగుదల భారత స్టాక్ మార్కెట్లను ఒక్కరోజులో తీవ్రంగా కుదిపేశాయి. హోర్ముజ్ జలసంధిలో నౌకలపై దాడులు, ఇరాన్‌తో తాత్కాలిక శాంతి ఒప్పందం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం ప్రపంచ మార్కెట్లలో రిస్క్-ఆఫ్ సెంటిమెంట్‌కు దారితీసింది. దీనివల్ల బుధవారం మధ్యాహ్నం వరకు లాభాల్లో కదలాడిన సూచీలు ఆ తర్వాత పతనమయ్యాయి. ముఖ్యంగా పెట్టుబడిదారులు ఈక్విటీల నుంచి నిష్క్రమించి సురక్షిత ఆస్తుల వైపు మొగ్గుచూపారు. ఫలితంగా బీఎస్ఈ సెన్సెక్స్ 1,677.12 పాయింట్లు క్షీణించి 76,503 వద్ద, నిఫ్టీ 516.65 పాయింట్లు పడిపోయి 23,882.05 వద్ద ముగిశాయి. గడిచిన రెండు నెలల కాలంలో సూచీలు ఒక్కరోజులో ఇంత భారీ పతనాన్ని చూడ్డం ఇదే మొదటిసారి. ఫలితంగా ఒక్కరోజులోనే పెట్టుబడిదారుల సంపద ఏకంగా రూ.8.56 లక్షల కోట్లు ఆవిరైంది. అమ్మకాల ఒత్తిడి అన్ని రంగాల షేర్లలోనూ కనిపించింది. ఫైనాన్షియల్, ఐటీ, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఆయిల్ అండ్ గ్యాస్, ఏవియేషన్, క్యాపిటల్ గూడ్స్ వంటి ప్రధాన రంగాల షేర్లు అమ్మకాలను ఎదుర్కొన్నాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 95.50 వద్ద ఉంది.

అధిక చమురు ధరలు కొనసాగితే భారత్‌కు దిగుమతి వ్యయం పెరగడం, కరెంట్ అకౌంట్ లోటు విస్తరించడం, ద్రవ్యోల్బణం పెరగడం, రూపాయిపై మరింత ఒత్తిడి ఏర్పడే ప్రమాదం ఉందని విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు. విదేశీ పెట్టుబడుల ప్రవాహం మందగించే అవకాశం కూడా మార్కెట్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు, ఆర్‌బీఐ తీసుకున్న విదేశీ కరెన్సీ ప్రవాహాలను ప్రోత్సహించే చర్యలు రూపాయికి కొంత మద్దతు ఇవ్వొచ్చని నిపుణులు భావిస్తున్నప్పటికీ, సమీప కాలంలో మార్కెట్ దిశను ప్రధానంగా పశ్చిమాసియా పరిణామాలు, ముడి చమురు ధరలు, విదేశీ పెట్టుబడులు, జూన్ త్రైమాసిక కార్పొరేట్ ఫలితాలే నిర్ణయించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో అస్థిరత కొనసాగే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది.

Next Story