బీఆర్‌ఎస్‌ పాలనలో స్కీమ్‌లు.. కాంగ్రెస్‌ పాలనలో స్కామ్‌లు: హరీష్ రావు

by Kodari Anjali |

బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజాసంక్షేమం కోసం పథకాలను ప్రవేశపేట్టి అమలు చేస్తే.. కాంగ్రెస్‌ ప్రజాపాలనలో పథకాలను స్కామ్‌లు చేస్తున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఆరోపించారు.

బీఆర్‌ఎస్‌ పాలనలో స్కీమ్‌లు.. కాంగ్రెస్‌ పాలనలో స్కామ్‌లు: హరీష్ రావు
X

దిశ, అందోల్‌: బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజాసంక్షేమం కోసం పథకాలను ప్రవేశపేట్టి అమలు చేస్తే.. కాంగ్రెస్‌ ప్రజాపాలనలో పథకాలను స్కామ్‌లు చేస్తున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఆరోపించారు. బుధవారం అందోలులోని లక్ష్మినర్సింహ ఫంక్షన్‌ హాల్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో బూత్‌ లేవల్‌ ఏజేంట్‌లకు ఎస్‌ఐఆర్‌పై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా హరీష్‌రావు మాట్లాడుతూ, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన వాళ్ల ఓట్లను తొలగించేందుకు కుట్రలను చేస్తున్నార న్నారు. ప్రతి ఒక్కరూ ఓటుహక్కును పొందాలంటే ఎస్‌ఐఆర్‌ ఫామ్‌లను తప్పనిసరిగా నింపేలా బీఎల్‌ఏలు శ్రమించాలన్నారు. ఎస్‌ఐఆర్‌ కార్యక్రమం పూర్తయిన తర్వాత పార్టీ సభ్యత్వ నమోదు ఉంటుందని ఆయన తెలిపారు. రైతులకు మూడు పంటలకు రైతు బంధు ఇవ్వాలని చెప్పిన రెవంత్‌రెడ్డి గడిచిన రెండున్నర ఏండ్ల పాలనలో రూ.19 వేల కోట్లను ఎగ్గొట్టారని ఆయన విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్‌ మెంట్‌ ఇవ్వకుండా, వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. గొర్రెలు, చేపల పంపిణీ ఊసేలేదని, దళిత బంధు రూ.12 లక్షలు ఏమైందని ఆయన ప్రశ్నించారు. బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ కార్పోరేషన్‌ల ద్వారా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. గురుకులాలు, విద్యుత్, బొగ్గు, సివిల్‌ సప్లయ్‌లతో పాటు ఇతరత్రా సంస్థలలో అనేక స్కామ్‌లు జరగాయన్నారు.

అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారే తప్ప..

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని మాటా తప్పి ఇందిరమ్మ పరువు తీస్తున్నారని, ఈ పథకానికి రెవంత్‌ ఆత్మీయ భరోసాగా మార్చుకుంటే బాగుంటుందని ఆయన ఎద్దేవా చేశారు. ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని వివిధ సందర్బాలలో రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాల దేవతల మీద ప్రమాణం చేసి మాటా తప్పి రైతులను నిలువునా మోసం చేశారన్నారు. కల్యాణ లక్ష్మి డబ్బులు పెళ్లి జరిగిన నెలలోపు రావాల్సి ఉండగా, వారికి పిల్లలు పుట్టాక వస్తున్నాయన్నారు. సకాలంలో సరిపడ యూరియా ఇవ్వడం లేదని, రైతు పంటలకు భీమాను కల్పిస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారే తప్ప ఇప్పటికి అమలు చేయలేదన్నారు. డిల్లీకి కట్టల బ్యాగులు మోయడం తప్ప మరోపని రెవంత్‌రెడ్డికి లేదన్నారు. ఈ సమావేశంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఎస్‌సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీ జడ్పీ చైర్‌ పర్సన్‌ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి, ఉమ్మడి మెదక్‌ జిల్లా సభ్యత్వ నమోదు ఇంచార్జీ బాలమల్లు, నియోజకవర్గ ఇంచార్జీ పట్నం మాణిక్యం, జిల్లా నాయకులు నరహరిరెడ్డి, కాసాల బుచ్చిరెడ్డి, పి.నారాయణ, మనోహర్‌గౌడ్, శివశేఖర్, భవానీ నాగరత్నం గౌడ్, విజయ్‌ కుమార్, రామాగౌడ్, మీనాక్షి సాయికుమార్, లింగాగౌడ్, సంజీవయ్య, వీరభద్రరావు, భక్తుల వీరప్ప, వీరారెడ్డి, మహేష్‌ యాదవ్, జిన్నా విజయ్, పింటూ, ఇమ్రాన్, వెంకటేశం, శైలజ, ప్రవీణ్‌రెడ్డి, అనిల్‌రెడ్డి, నరేందర్‌రెడ్డిలతో పాటు తదితరులు పాల్గొన్నారు.

త్వరలో పాదయాత్ర చేస్తా....

బస్వవేశ్వర–సంగమేశ్వర ప్రాజెక్టు సాధన కోసం త్వరలో పాదయాత్రను చేపట్టేందుకు సిద్దంగా ఉన్నానని, నావెంట నడిచే వాళ్లు సిద్దంగా ఉండాలని హరీష్‌రావు అన్నారు. సింగూరు కాలువల ద్వారా ప్రస్తుతం అందోలు, పుల్కల్‌ మండలాలకు 40 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని, బస్వవేశ్వర–సంగమేశ్వర ప్రాజెక్టు పూర్తయితే అందోలు నియోజకవర్గంలో 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. నారాయణఖేడ్‌లోని బోరంచ అమ్మవారి నుంచి జహిరాబాద్‌లోని రెజింతల్‌లో సిద్దివినాయక అలయంలో పూజలు చేసి కాంగ్రేసోళ్లకు జ్ఞానోదయం కలగాలని మొక్కుదామన్నారు. బస్వవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టు పనులను ప్రారంభించే లా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొద్దామన్నారు. సింగూరు ప్రాజెక్టు మరమ్మత్తులు నత్తనడకన సాగుతున్నాయని, రైతులకు క్రాఫ్‌ హాలీడే ప్రకటించి, ఎక్స్‌గ్రేషియాను చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

చర్చలకు రమ్మన్నరు.. వస్తే పోలీసులతో అడ్డుకున్నరు..

విద్యార్థులకు అందించేందుకు డ్రెస్‌లు, షూస్, గుడ్లు ఇతరత్రా వాటిని సరఫరా చేసేందుకు గుజరాత్‌కు చెందిన వ్యక్తికి కాంట్రాక్ట్‌ను అప్పగిస్తే..ఈ టెండర్లలో రూ.2 వేల కోట్ల స్కామ్‌ జరిగినట్లు బయపెట్టానన్నారు. ఈ విషయంపై చర్చకు రావాలంటూ కాంగ్రెస్‌ మంత్రులు సవాల్‌ చేశారని, తాను చర్చలకు వేళ్లేందుకు బీఆర్‌ఎస్‌ భవన్‌ నుంచి బయటకు వస్తుంటే పోలీసులను పంపించి అడ్డుకున్నారని, తప్పుచేయకపోతే పోలీసులతో ఎందుకు అడ్డుకున్నారనో ప్రజలకు చెప్పాలన్నారు. చర్చలకు పిలిచింది వాళ్లే...అడ్డుకున్నదే వాళ్లేనని, ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని, వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

Next Story