కాడెద్దుగా మారిన రైతు..!

by Ratna Kumari |

భూమిని అమ్మగా భావించి, తన చెమటతో పంటలు పండించి కోట్లాది మంది ఆకలి తీర్చే రైతు జీవితం కష్టాలతోనే సాగుతోంది.

కాడెద్దుగా మారిన రైతు..!
X

దిశ, కొత్తగూడ : భూమిని అమ్మగా భావించి, తన చెమటతో పంటలు పండించి కోట్లాది మంది ఆకలి తీర్చే రైతు జీవితం కష్టాలతోనే సాగుతోంది. అలాంటి హృదయ విదారక ఘటన మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు పెనక ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం, నాలుగు రోజుల క్రితం విద్యుత్ ఘాతానికి గురై తన జంట కాడెద్దుల్లో ఒకటి మృతి చెందింది. వ్యవసాయానికి ప్రధాన ఆధారమైన ఎద్దును కోల్పోవడంతో రైతు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. ఖరీఫ్ సాగు పనులు ఆగిపోతే ఏడాది శ్రమ వృథా అవుతుందనే ఆందోళన ఒకవైపు, కొత్త కాడెద్దు కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత లేకపోవడం మరోవైపు అతడిని తీవ్ర మనోవేదనకు గురిచేశాయి. ట్రాక్టర్‌తో పొలం దున్నించుకునేందుకు అవసరమైన డబ్బులు లేకపోవడంతో పాటు ఇతర రైతుల వద్ద నుంచి కాడెద్దులు కూడా అందుబాటులో లేకపోయాయి. దీంతో పంటను వదులుకోవడానికి మనసు ఒప్పుకోని రైతు, ఒకవైపు మిగిలిన కాడెద్దును నాగలికి కట్టి, మరోవైపు తానే కాడెద్దుగా మారి నాగలిని భుజాన మోస్తూ పొలాన్ని దున్నాడు. శరీరం అలసిపోయినా, చెమటలు కారుతున్నా పంటపై ఉన్న ఆశతో సాగు పనులు కొనసాగించాడు. రైతు నాగలి లాగుతున్న దృశ్యాలను చూసిన గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు. దేశానికి అన్నం పెట్టే రైతు ఇంత దయనీయ పరిస్థితుల్లో వ్యవసాయం చేయాల్సి రావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ ప్రమాదంలో ఎద్దును కోల్పోయిన రైతుకు ప్రభుత్వం తక్షణమే తగిన పరిహారం అందించడంతో పాటు ప్రత్యామ్నాయంగా కాడెద్దు లేదా అవసరమైన ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని గ్రామస్థులు, రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Next Story