భూ మాయ.. 10 ఎకరాలు కొట్టేసేందుకు కుట్ర?

by Jakkula.Mamatha |

జిల్లాలో ఎక్కడ చూసినా ఇసుక, మట్టి, భూ దందా మాఫియా పెద్దఎత్తున కొనసాగుతోంది.

భూ మాయ.. 10 ఎకరాలు కొట్టేసేందుకు కుట్ర?
X

నల్గొండ నియోజకవర్గ పరిధిలో కోట్లాది రూపాయల విలువైన భూ దోపిడీ పర్వం కలకలం రేపుతోంది. కేశరాజుపల్లి రెవెన్యూ పరిధిలో రియల్టర్లు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై భూములను కొట్టేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త వెంచర్‌కు ఆనుకొని ఉన్న సర్వే నంబర్ 52లోని 6 ఎకరాల లావుణి పట్టా భూమిని టార్గెట్ చేశారు. సదరు భూమిని స్వాహా చేసేందుకు ఏకంగా ఆన్‌లైన్ రికార్డుల నుంచే ఆ సర్వే నంబర్‌ను మాయం చేయడం గమనార్హం. అంతేకాక ఆక్రమిత భూములతోపాటు పక్కనే ఉన్న కాలువలు, చెరువు కట్టలను పూడ్చి రోడ్లు నిర్మిస్తున్నారు. ఈ అక్రమ దందా వెనుక అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. విలువైన భూములను కాపాడాల్సిన అధికారులే రియల్టర్లకు వత్తాసు పలకడం పై ప్రజలు మండిపడుతున్నారు.

దిశ, నల్గొండ బ్యూరో: జిల్లాలో ఎక్కడ చూసినా ఇసుక, మట్టి, భూ దందా మాఫియా పెద్దఎత్తున కొనసాగుతోంది. అందులో ముఖ్యంగా నల్గొండ నియోజకవర్గంలో కోట్లాది రూపాయల భూ దోపిడీ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే నల్గొండ జిల్లా కేంద్రంలోని మిర్యాలగూడ రోడ్డులో రూ.కోట్ల విలువైన భూమిని కొట్టేసేందుకు అధికారులు, రియల్టర్లు కుమ్మక్కైనట్లు ప్రచారం జరుగుతోంది. నల్గొండ పట్టణ కేంద్రం ప్రస్తుతం భూ అక్రమ దందాకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇరిగేషన్ భూమిలో నుంచి తన వెంచర్‌లోకి వెళ్లడానికి దౌర్జన్యంగా రోడ్డు వేసుకున్నారు. కతాల్‌గూడెం సమీపంలో ఏర్పాటు చేస్తున్న సదరు వెంచర్ కోసం చెరువు కట్టను కూడా ఆక్రమించారనే విమర్శలు వస్తుండగా, రెవెన్యూ అధికారులు సైతం సర్వే చేసి ఈ అక్రమాన్ని తేల్చేసినట్లు సమాచారం.

ఆన్‌లైన్‌లో సర్వే నంబర్ మాయం..

మిర్యాలగూడ రోడ్డులో తిప్పర్తి మండల రెవెన్యూ పరిధిలోని కేశరాజుపల్లి గ్రామంలో ప్రధాన రహదారికి ఆనుకుని ఒక ప్రైవేట్ వెంచర్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ వెంచర్‌కు ఆనుకొని ఉన్న విలువైన భూమిని కొట్టేసేందుకు రెవెన్యూ అధికారులు సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారితో చేతులు కలిపినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే వెంచర్ సరిహద్దుల్లోని సర్వే నెంబర్ 52లో ఉన్న 6 ఎకరాల లావుణి పట్టా భూమిని రికార్డుల నుంచి మాయం చేశారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో 52 సర్వే నంబర్ తప్ప మిగతా అన్ని నంబర్లు స్పష్టంగా కనిపిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆ భూమిని పూర్తిగా స్వాహా చేయడానికే రెవెన్యూ యంత్రాంగం లోపాయికారీగా సహకరిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

భూమి విలువ రూ.10కోట్లకు పైనే..

నల్గొండ కార్పొరేషన్ పరిధిలోని కేశరాజుపల్లి రెవెన్యూ గ్రామంలో ప్రస్తుతం ఒక ఎకరం భూమి విలువ సుమారు కోటికి పైనే పలుకుతోంది. ఆ లెక్కన సర్వే నెంబర్ 52లో మాయం చేసిన భూమి విలువ రూ.6కోట్లకు పైనే ఉంటుంది. దీనికి తోడు పక్కనే ఉన్న మరో సర్వే నంబర్‌లోని రెండు ఎకరాలను, చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ స్థలాలను కలిపి మొత్తం 10 ఎకరాల వరకు మింగేసేందుకు సదరు రియల్ వ్యాపారి కుట్రలు పన్నుతున్నట్లు సమాచారం. వెంచర్‌కు ఆనుకొని ఉన్న సహజ సిద్ధమైన చిన్న చిన్న కాలువలను సైతం పూడ్చివేసి రోడ్లు వేసుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ కోట్లాది రూపాయల దోపిడీలో అధికారులు, అధికార పార్టీ నాయకులు, కాంట్రాక్టర్లు భాగస్వాములు కావడంతో ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Next Story