కవిత ఆరోపణల పై సీబీఐ విచారణకు ఆదేశించాలి : ఎంపీ ధర్మపురి అర్వింద్

by Batti.Sumithra |

ఎమ్మెల్సీ, తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణల పై స్వతంత్ర సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.

కవిత ఆరోపణల పై సీబీఐ విచారణకు ఆదేశించాలి : ఎంపీ ధర్మపురి అర్వింద్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఎమ్మెల్సీ, తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణల పై స్వతంత్ర సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. నిజామాబాద్‌లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ స్వయంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యురాలు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావుల పై చేసిన అవినీతి, క్విడ్ ప్రో కో ఆరోపణల పై స్పందించారు. కేటీఆర్, హరీశ్ రావుల పై వచ్చిన క్విడ్ ప్రో కో వంటి ఆరోపణలు సాధారణమైనవి కావని అన్నారు. కవిత చేసిన ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ నిధులు, క్విడ్ ప్రో కో లావాదేవీలు, ప్రదీప్ కన్స్ట్రక్షన్స్‌తో జరిగినట్లు ఆరోపించిన ఒప్పందాలు, ఫీనిక్స్ సంస్థకు రాజకీయ అండ, గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాంట్రాక్టర్లకు భూముల కేటాయింపుల పై కవిత చేసిన వ్యాఖ్యలు ప్రజాప్రయోజనాలకు సంబంధించినవని అర్వింద్ అన్నారు. ఈ అంశాల పై ఎలాంటి అనుమానాలకు తావులేకుండా స్వతంత్ర సీబీఐ దర్యాప్తు జరిపించాలని ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.

కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసును సీబీఐకి అప్పగించడంలో జాప్యం, ఈ-కార్ రేసు వ్యవహారంలో ఆరోపణలు ఉన్నప్పటికీ విచారణ ముందుకు సాగకపోవడం, ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధ్యుల పై ఇప్పటి వరకు కఠిన చర్యలు తీసుకోకపోవడం వంటి పరిణామాల వల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి పై ప్రజల్లో ఇప్పటికే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అర్వింద్ పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కయ్యాయనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాలంటే ప్రభుత్వం వెంటనే ఈ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించి, పూర్తిపారదర్శకతతో నిజానిజాలను వెలికితీసి, బాధ్యుల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.

Next Story