వ్యక్తిగతంగానే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు

by Taduka Kalyani |

-సొసైటీలతో సంబంధం లేకుండా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చే విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.

వ్యక్తిగతంగానే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు
X

దిశ, చింతకాని :-సొసైటీలతో సంబంధం లేకుండా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చే విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్ - హెచ్ - 2843) ఖమ్మం జిల్లా కమిటీ గురువారం చింతకాని మండలం లచ్చగూడెంలో సమర్పించిన వినతిపత్రం పై డిప్యూటీ సీఎం స్పందించారు. మండలంలోని జగన్నాథపురంలో శుక్రవారం జరిగే రైతు ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి హాజరవుతున్న దృష్ట్యా జర్నలిస్టుల ఇండ్ల స్థలాల అంశాన్ని సీఎం దృష్టికి తీసుకు వెళ్లాల్సిందిగా టీడబ్ల్యూజేఎఫ్ నేతలు కోరారు. దీనిపై స్పందించిన భట్టి... సొసైటీల ద్వారా అయితే న్యాయపరమైన చిక్కులు ఉంటాయి కాబట్టి, అవేవీ లేకుండా వ్యక్తిగతంగానో...బీపీఎల్ కోటాలోనో...మరో రకంగానో ఇచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.‌ జర్నలిస్టుల్లో చాలామంది పేదలు, మధ్యతరగతి వర్గానికి చెందినవారు, చాలీచాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్నారని, అద్దె ఇండ్లలో ఉంటూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వినతిపత్రంలో టీడబ్ల్యూజేఎఫ్ పేర్కొంది. జర్నలిస్టుల ఇండ్ల స్థలాల విషయమై అనేక పర్యాయాలు గత, ప్రస్తుత ప్రభుత్వంలో టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో విజ్ఞప్తులు, పోరాటాలు నిర్వహించామని ఫెడరేషన్ నేతలు తెలిపారు.

ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం వెలుగుమట్ల, వీవీ పాలెం రెవెన్యూలో 23 ఎకరాలకు పైగా కేటాయిస్తూ జీవో ఇచ్చిందని, కానీ అది కార్యరూపం దాల్చలేదని సూచించారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దీనిపై కొంత సందిగ్ధత ఏర్పడిందని న్యాయపరమైన చిక్కులు లేకుండా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు పంపిణీ చేసే విషయమై ఇప్పటికే ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ప్రకటనలు చేసి ఉన్నారని ప్రస్తావించారు. సొసైటీలతో సంబంధం లేకుండా జర్నలిస్టులకు వ్యక్తిగతంగా ఇండ్ల స్థలాలు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ విషయంలో నాన్చివేత ధోరణి విడనాడాలని కోరారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకొని తమరి నియోజకవర్గానికి విచ్చేస్తున్న దృష్ట్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ ప్రాతిపదికన, ఎప్పటి లోగా ఇండ్ల స్థలాలు ఇస్తారో...! నిర్దిష్టమైన తేదీతో సహా వెల్లడించేలా స్పష్టమైన ప్రకటన చేయించాలని కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సయ్యద్ ఖదీర్, కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యక్షులు దువ్వా సాగర్, టీబీజేఏ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆవుల శ్రీనివాస్, మానుకొండ రవికిరణ్, జిల్లా కమిటీ సభ్యులు రాంపుడి నాగేశ్వరరావు, కొత్త యాకేష్, మంకెన నాగేశ్వరరావు, నూకల రామచంద్రమూర్తి, కొమెర నాగేశ్వరరావు, ఖమ్మం నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు తురగ రాఘవేంద్రమూర్తి, గరిడేపల్లి వెంకటేశ్వర్లు, స్టేట్ కౌన్సిల్ మెంబర్ నలుబోల మధుశ్రీ, టీబీజేఏ కెమెరామన్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఫయాజ్, గణేష్, అర్షద్, శరత్, నాయకులు సీహెచ్ ప్రసాద్, సురేందర్, గడ్డం విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story