బ్రేకింగ్ న్యూస్.. మరోసారి మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ అరెస్ట్

by Malleboina Mahesh |   (  Updated:2026-07-09 15:12:01  IST  )

మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ గచ్చిబౌలి ఫ్లాట్‌లో రూ.56 లక్షల నగదు సీజ్.. రెండు ఫ్లాట్లను బలవంతంగా రాయించుకున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించి అరెస్ట్ చేశారు.

బ్రేకింగ్ న్యూస్.. మరోసారి మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ ను మరోసారి అరెస్ట్ చేశారు. గతంలో శేరిలింగంపల్లి ఆర్‌డీఓ (RDO) గా పనిచేసి, ప్రస్తుతం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అర్బన్ ల్యాండ్ సీలింగ్ (ULC) విభాగంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్న మర్రి వంశీ మోహన్ అవినీతి లీలలపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మరోసారి ఉచ్చు బిగించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో (Disproportionate Assets Case) ఇప్పటికే విచారణ ఎదుర్కొంటున్న వంశీ మోహన్ బినామీల ఇళ్లతో పాటు, గచ్చిబౌలిలోని ఆయనకు చెందిన లగ్జరీ ఫ్లాట్‌లో ఏసీబీ అధికారులు గురువారం ముమ్మర సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో గచ్చిబౌలి ఫ్లాట్ నుంచి ఏకంగా రూ.56 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

వందల కోట్ల అక్రమాస్తులు..

ఏసీబీ జరిపిన తాజా విచారణలో వంశీ మోహన్ తన అధికార బలాన్ని ఉపయోగించి ఇద్దరు బాధితుల నుంచి రెండు ఖరీదైన ఫ్లాట్లను బలవంతంగా తన బినామీల పేరిట రాయించుకున్నట్లు (రిజిస్ట్రేషన్) అధికారులు ఆధారాలతో సహా గుర్తించారు. శేరిలింగంపల్లి, అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలో విలువైన ప్రభుత్వ భూములను అక్రమంగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం, తన మామ విజయ్ భాస్కర్ పేరిట 8 ఎకరాల భూమిని మార్చడం వంటి వివాదాస్పద భూ లావాదేవీలపై ఏసీబీ అధికారులు కీలక పత్రాలను సేకరించారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఆయన ఆస్తుల విలువ రూ.6.22 కోట్లుగా చూపించినప్పటికీ.. బహిరంగ మార్కెట్‌లో వంశీ మోహన్ కూడబెట్టిన అక్రమాస్తుల విలువ రూ.100 కోట్ల నుంచి రూ.200 కోట్ల పైమాటే ఉంటుందని ఏసీబీ అంచనా వేస్తోంది. బినామీల ఇళ్లలో దొరికిన ఆధారాలు, బలవంతపు వసూళ్ల ఫిర్యాదుల నేపథ్యంలో వంశీ మోహన్‌ను ఏసీబీ అధికారులు మళ్లీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Next Story