సుప్రీంకోర్టుకు సిట్.. రోజుకో మ‌లుపు తిరుగుతున్న నాగరాజు కస్టడీ

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-07-09 15:12:45  IST  )

రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు విచార‌ణ రోజుకో మ‌లుపు తిరుగుతోంది. ప్ర‌ధాన నిందితుడు, అప్ప‌టి సీఐ నాగరాజు క‌స్ట‌డీ విచార‌ణ‌పై ష‌ర‌తులు విధిస్తూ దిగువ కోర్టులు ఇచ్చిన ఆదేశాల‌ను ర‌ద్దు చేయాలంటూ ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్‌) సుప్రీంకోర్టు త‌లుపు త‌ట్టింది...

సుప్రీంకోర్టుకు సిట్..  రోజుకో మ‌లుపు తిరుగుతున్న నాగరాజు కస్టడీ
X

దిశ‌, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు విచార‌ణ రోజుకో మ‌లుపు తిరుగుతోంది. ప్ర‌ధాన నిందితుడు, అప్ప‌టి సీఐ నాగరాజు క‌స్ట‌డీ విచార‌ణ‌పై ష‌ర‌తులు విధిస్తూ దిగువ కోర్టులు ఇచ్చిన ఆదేశాల‌ను ర‌ద్దు చేయాలంటూ ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్‌) సుప్రీంకోర్టు త‌లుపు త‌ట్టింది. దీంతో సాయికృష్ణ కేసులో ప్ర‌ధాన నిందితుడైన సీఐ నాగ‌రాజు క‌స్ట‌డీ రెండోసారి కూడా ఆగిపోయింది. కృష్ణలంక రౌడీషీట‌ర్ సాయికృష్ణ అదృశ్యం కేసులో సిట్ ద‌ర్యాప్తులో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

ఈ నెల 2న శుక్ర‌వారం నుంచి 10వ తేదీ వ‌ర‌కు సీఐ నాగ‌రాజును సిట్ క‌స్ట‌డీకి అనుమ‌తిస్తూ విజ‌య‌వాడ రెండో అద‌న‌పు చీఫ్ మెట్రోపాలిట‌న్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయ‌మూర్తి ఆదేశాలు జారీ చేశారు. రాజ‌మండ్రి కేంద్ర కారాగారంలోనే ఉద‌యం 10 గంట‌ల నుంచి సాయంత్రం 5గంట‌ల వరకు న్యాయ‌వాది స‌మ‌క్షంలో విచారించాల‌ని కోర్టు పేర్కొంది. విచార‌ణ వివ‌రాల‌ను ఆడియో, వీడియో రికార్డు చేయ‌డంతో పాటు విచార‌ణ ముగిసిన త‌ర్వాత కోర్టుకు నివేదిక రూపంలో అంద‌జేయాల‌ని స్ప‌ష్టం చేశారు. కోర్టు ఆదేశాల‌ను స‌వాల్ చేస్తూ సిట్ అధికారులు హైకోర్టును ఆశ్ర‌యించారు. ఇరువ‌ర్గాల వాద‌న‌ల‌ను విన్న ఉన్న‌త న్యాయ‌స్థానం..దిగువ కోర్టు ఆదేశాల‌ను స‌వ‌రిస్తూ గ‌త మంగ‌ళ‌వారం కీల‌క ఆదేశాలను జారీ చేసింది. ప్ర‌ధాన నిందితునిగా పేర్కొన్న సీఐ నాగ‌రాజును గురువారం నుంచి ఎనిమిది రోజుల పాటు క‌స్ట‌డీకి ఇవ్వ‌డంతో పాటు కృష్ణలంక పోలీసు స్టేష‌న్‌లో సీన్‌-రీక‌న్‌స్ర్ట‌క్ష‌న్‌, సాక్షుల‌తో క‌లిపి, విడివిడిగా అనుమ‌తించేందుకు న్యాయ‌స్థానం అంగీక‌రించింది. అయితే విచార‌ణ ప్ర‌క్రియ‌ను వీడియోగ్ర‌ఫీ చేయించి సంబంధిత న్యాయ‌స్థానంలో అంద‌జేయాల‌ని ఏపీ హైకోర్టు స్ప‌ష్టం చేసింది. హైకోర్టు ఆదేశాల‌తో విచార‌ణ జ‌రిపితే సాయికృష్ణ క‌స్టోడియ‌ల్ డెత్ కేసులో వాస్త‌వాలు రాబ‌ట్టే అవ‌కాశం లేద‌ని సిట్ అధికారులు భావిస్తున్నారు. విచార‌ణ ప్ర‌క్రియ‌ను వీడియో తీస్తే నిందితుడు నోరు విప్పే అవ‌కాశం లేదంటున్నారు.

ఇప్ప‌టికే విచార‌ణ స‌మ‌యంలో సిట్ ద‌ర్యాప్తుకు ఏమాత్రం స‌హ‌క‌రించ‌ని ప్ర‌ధాన నిందితుడు..కోర్టు ఇచ్చిన వెసులుబాట్ల‌ను సాకుగా చూపి విచార‌ణ‌కు ఏమాత్రం స‌హ‌క‌రించ‌డ‌ని చెపుతున్నారు. సాయికృష్ణను హింసించి చంప‌డంతో పాటు మృత‌దేహం అదృశ్యం, అందుకు స‌హ‌క‌రించిన వారి వివ‌రాలు, సాంకేతిక ఆధారాలు, సాక్ష్యాల‌ను వెలికి తీయాలంటే నాగ‌రాజును స‌మ‌గ్రంగా విచారించాల్సిన అవ‌స‌రం ఉంద‌నేది సిట్ అధికారుల భావ‌న‌. దీనిని దృష్టిలో ఉంచుకొని లోయ‌ర్ కోర్టు, హైకోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను స‌వ‌రిస్తూ క‌స్ట‌డీకి అనుమ‌తించాల‌ని సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీంతో గురువారం నాగ‌రాజును క‌స్ట‌డీలోకి తీసుకోవాల్సి ఉన్న‌ప్ప‌టికీ తీసుకోలేదు. అంత‌కు ముందు దిగువ కోర్టు ఆదేశాల‌ను స‌వాల్ చేసేందుకు సైతం నాగ‌రాజును క‌స్ట‌డీకి తీసుకోలేదు. మ‌రి సుప్రీం సిట్ వాద‌న‌ను ఏ విధంగా స‌మ‌ర్థిస్తుందో వేచి చూడాలి.

Next Story