Honda: భారత్‌లో హోండా రూ. 2,400 కోట్లకు పైగా పెట్టుబడులు

by S Gopi |

ప్రస్తుతం హర్యానా, రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్‌లలోని నాలుగు ప్లాంట్ల ద్వారా ఏడాదికి 60 లక్షలకు పైగా ద్విచక్ర వాహనాలను తయారు చేస్తున్న కంపెనీ, రాజస్థాన్‌లోని ప్లాంట్‌లో రూ.1,500 కోట్లతో కొత్త ప్రొడక్షన్ లైన్‌ను ఏర్పాటు చేస్తోంది.

Honda: భారత్‌లో హోండా రూ. 2,400 కోట్లకు పైగా పెట్టుబడులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) భారత్‌ను గ్లోబల్ తయారీ కేంద్రంగా చూస్తున్నట్టు తెలిపింది. ఇందుకోసం 2028 నాటికి దేశంలో రూ. 2,400 కోట్లకు పైగా పెట్టుబడులు, వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 80 లక్షల యూనిట్లకు పెంచడంతో పాటు 3,800కిపైగా కొత్త ఉద్యోగాలు సృష్టించనున్నట్లు కంపెనీ ప్రెసిడెంట్, సీఈఓ సుత్సుము ఒటాని తెలిపారు. ప్రస్తుతం హర్యానా, రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్‌లలోని నాలుగు ప్లాంట్ల ద్వారా ఏడాదికి 60 లక్షలకు పైగా ద్విచక్ర వాహనాలను తయారు చేస్తున్న కంపెనీ, రాజస్థాన్‌లోని ప్లాంట్‌లో రూ.1,500 కోట్లతో కొత్త ప్రొడక్షన్ లైన్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇది 2028లో ప్రారంభమై ఏటా 6.7 లక్షల యూనిట్ల అదనపు సామర్థ్యాన్ని అందిస్తుంది. అలాగే గుజరాత్‌లోని విఠలాపూర్ ప్లాంట్‌లో రూ.920 కోట్లతో నిర్మిస్తున్న నాలుగో ప్రొడక్షన్ లైన్ 2027లో ప్రారంభం అవుతుందని, ఆ ప్లాంట్ హోండాకు ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్‌సైకిల్ అసెంబ్లీ కేంద్రంగా మారనుందని కంపెనీ వెల్లడించింది. దేశీయ మార్కెట్‌తో పాటు ఎగుమతుల అవసరాలను దృష్టిలో పెట్టుకునే ఈ విస్తరణను చేపడుతున్నట్లు హోండా తెలిపింది. ప్రస్తుతం భారత్ నుంచి 65 దేశాలకు ద్విచక్ర వాహనాలను ఎగుమతి చేస్తున్న కంపెనీ, 2024లో 3.6 లక్షల యూనిట్లు, 2025లో 5.1 లక్షలకు, 2026లో 6.2 లక్షల యూనిట్లకు పెంచింది.

Next Story