- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Housing Market: హౌసింగ్ మార్కెట్‌లో ప్రీమియం ఇళ్లకు భారీ డిమాండ్
ముంబై, బెంగళూరు, హైదరాబాద్, పుణే, చెన్నై, అహ్మదాబాద్, కోల్‌కతా మార్కెట్లలో వృద్ధి కనిపించగా, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో మాత్రం అమ్మకాలు 7 శాతం తగ్గాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: కోవిడ్ తర్వాత వరుసగా నాలుగేళ్లు వేగంగా పెరిగిన భారత హౌసింగ్ మార్కెట్ ఇప్పుడు స్థిరీకరణ దశలోకి అడుగుపెట్టిందని నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది జనవరి-జూన్ మధ్య దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 0.7 శాతం పెరిగి 1,71,471 యూనిట్లకు చేరాయి. ముంబై, బెంగళూరు, హైదరాబాద్, పుణే, చెన్నై, అహ్మదాబాద్, కోల్‌కతా మార్కెట్లలో వృద్ధి కనిపించగా, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో మాత్రం అమ్మకాలు 7 శాతం తగ్గాయి. మరోవైపు ఇదే సమయంలో కొత్తగా ప్రారంభమైన హౌసింగ్ ప్రాజెక్టులు 4 శాతం పెరిగి 1,87,350 యూనిట్లకు చేరడం డెవలపర్లు భవిష్యత్ డిమాండ్‌పై సానుకూలంగా ఉన్నారని సూచిస్తోంది. అయితే ఈ అమ్మకాల్లో ఆసక్తికరంగా, మధ్యతరగతి ఇళ్ల కంటే కోటి రూపాయల పైబడిన 'ప్రీమియం, లగ్జరీ' గృహాలకే విపరీతమైన డిమాండ్ ఉంది. మొత్తం ఇళ్ల అమ్మకాలలో ఈ లగ్జరీ ఇళ్లే ఏకంగా 54 శాతం వాటాతో టాప్ గేర్‌లో దూసుకుపోతుండటం విశేషం.
మార్కెట్లో లగ్జరీ ఇళ్లకు డిమాండ్ పెరుగుతుంటే, సామాన్యుడికి అందుబాటులో ఉండే తక్కువ, మధ్య ఆదాయ ఇళ్ల అమ్మకాలు మాత్రం నిరాశాజనకంగా ఉన్నాయి. సరైన సరఫరా లేకపోవడం వల్ల రూ. 50 లక్షల లోపు ఉండే బడ్జెట్ ఇళ్ల విక్రయాలు గతేడాదితో పోలిస్తే ఏకంగా 15 శాతం పడిపోయాయి. అలాగే రూ. 50 లక్షల నుంచి రూ. కోటి లోపు ఉండే ఇళ్ల అమ్మకాలు కూడా 5 శాతం తగ్గాయి. ఈ ట్రెండ్‌పై నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజల్ విశ్లేషిస్తూ.. వృద్ధి రేటు కాస్త మందగించినట్లు అనిపించినా మార్కెట్ పటిష్టంగా ఉందన్నారు. ప్రజల వార్షిక ఆదాయాలు పెరగడం, సొంత ఇల్లు, అన్ని వసతులతో కూడిన పెద్ద ఇల్లు ఉండాలనే వినియోగదారుల ఆకాంక్షలు మారడం వల్లే లగ్జరీ ఇళ్లకు డిమాండ్ పెరిగిందని ఆయన వివరించారు. దీనికి తోడు నగరాల విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన కూడా ఈ మార్కెట్ స్థిరత్వానికి సహకరిస్తోందని శిశిర్ బైజల్ వెల్లడించారు.






