ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర దిగ్భ్రాంతి

by velandi.Saikiran |

అనుపురం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర దిగ్భ్రాంతి
X

దిశ, వేములవాడ : వేములవాడ అర్బన్ మండలం అనుపురం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టాటా ఎస్ వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో గాయపడి వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను జిల్లా ఎస్పీ మహేష్ బి.గీతేతో కలిసి విప్ పరామర్శించారు. బాధితులకు అందుతున్న వైద్య సేవల వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రమాదం తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రమాద సమయంలో బొలెరో వాహనంలో కూలీలు ఉన్నారని, వారిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. త్రీవ్రంగా గాయపడిన ఆ ఇద్దరిని మెరుగైన వైద్య చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. బాధితులకు, వారి కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు.వారి వెంట మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్ తో పాటు వేములవాడ డిఎస్పీ శ్రీనివాసులు, సీఐ వీర ప్రసాద్ తదితరులు ఉన్నారు.

Next Story