ఎస్‌ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా జరిగేందుకు సహకరించాలి

by velandi.Saikiran |

ఎస్‌ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా కోరారు.

ఎస్‌ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా జరిగేందుకు సహకరించాలి
X

దిశ,మహబూబ్ నగర్ ప్రతినిధి: ఎస్‌ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా కోరారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ముందుగా గత సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రస్తావించిన సమస్యలు, వాటి పరిష్కారానికి జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఎస్‌ఐఆర్ ప్రక్రియ అమలులో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న పలు సమస్యలను రాజకీయ పార్టీల ప్రతినిధులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.

కొంతమంది బిఎల్ఓ లు ఇంటింటికీ వెళ్లకుండా ఒకేచోట కూర్చొని ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తున్నారని, చాలా మంది ఓటర్లకు ఫారాలు ఎలా పూరించాలో అవగాహన లేకపోవడంతో పాటు కొందరు బీఎల్‌వోలకు కూడా పూర్తి అవగాహన లేదని వారు తెలిపారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ఆలస్యంగా జరుగుతోందని, ప్రక్రియను వేగవంతం చేసేందుకు బిఎల్ఓ లకు అదనపు సిబ్బందిని నియమించాలని కోరారు. ఎస్‌ఐఆర్‌ పై ప్రజల్లో ఇంకా పూర్తిస్థాయి అవగాహన లేదని, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో శానిటేషన్ వాహనాల ద్వారా ఆడియో ప్రచారం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా మాట్లాడుతూ, రాజకీయ పార్టీల ప్రతినిధులు చేసిన సూచనలు, లేవనెత్తిన అంశాలను తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు.

రాజకీయ పార్టీలు నియమించిన బిఎల్ఎ లు క్షేత్రస్థాయిలో బిఎల్ఓ లకు సహకరించేలా దిశానిర్దేశం చేయాలని కోరారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో బిఎల్ఓ ల పనితీరు ఆశించిన స్థాయిలో లేదని గుర్తించామని, వారికి అవసరమైన సహకారం అందించేందుకు ఆర్‌పీ లు, బిఎల్ఓ సూపర్‌వైజర్లు నిరంతరం పర్యవేక్షించేలా ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. జిల్లాలో అధిక శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయిందని, రాబోయే రెండు వారాల్లో బిఎల్ఓ లు ఎన్యూమరేషన్ ఫారాల సేకరణపై ప్రధానంగా దృష్టి సారిస్తారని చెప్పారు. రాజకీయ పార్టీలు తమ బిఎల్ఎ ల ద్వారా ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను సక్రమంగా నింపేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జెఎల్ బి హరిప్రియ, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ సాయి శివాని, డిఆర్‌ఓ నిర్మల, ఆర్‌డీఓ నవీన్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Next Story