- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సరిహద్దు ‘జిమ్మిక్కు’.. ప్రభుత్వ భూమి లటుక్కు..?

దిశ, పేట్ బషీరాబాద్: అధికార పార్టీలు మారినా.. అధికారులు మారినా.. ఆక్రమణదారుల రూట్ మాత్రం మారడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు ‘బోర్డర్’ జిమ్మిక్కులతో బోర్డులు మార్చేసి, ఆక్రమణలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. నాడు నర్సరీ పేరుతో కబ్జాకు యత్నిస్తే అధికారులు జేసీబీలతో కూల్చేశారని, నేడు అదే స్థలంలో సరిహద్దుల మాయాజాలం ప్రదర్శిస్తూ కార్ల షోరూం వెలిసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం పేట్ బషీరాబాద్ సర్వే నెంబర్ 25/2 లోని ప్రభుత్వ భూమిపై ఇప్పుడు మరొక కొత్త వివాదం వెలుగులోకి వచ్చింది. పొరుగు గ్రామం కొంపల్లి సర్వే నెంబర్ అంటూ కొత్త పల్లవి అందుకుంటూ.. సర్కారు భూమిని గుట్టుచప్పుడు కాకుండా స్వాహా చేసేందుకు పక్కా స్కెచ్ వేశారనే ఆరోపణలు స్థానికంగా బలంగా ఉన్నాయి.
నాడు కూల్చివేత.. నేడు కార్ల దుకాణం!
గతంలో (2024 జూన్ నెలలో) ఇదే సర్వే నెంబర్ 25/2 ప్రభుత్వ భూమిలో ఒక నర్సరీని అక్రమంగా ఏర్పాటు చేశారు అనే పిర్యాదుతో అప్పటి రెవిన్యూ ఇన్స్పెక్టర్ రేణుక పోలీసు బందోబస్తు తో కూల్చివేతలు చేశారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొన్నాళ్లకే ఆక్రమణదారులు మళ్లీ రూట్ మార్చారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అదే స్థలంలో ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేపట్టి, ఏకంగా ‘సెకండ్ హ్యాండ్ కార్ల సేల్స్’ దుకాణాన్ని ఏర్పాటు చేయడం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది.
రెండు గ్రామాల బోర్డర్‌లో జిమ్మిక్కులు..?
ప్రస్తుతం కార్ల దుకాణం నడుస్తున్న భూమి, పక్కాగా గతంలో అధికారులు గుర్తించిన సర్వే నెంబర్ 25/2 ప్రభుత్వ భూమేనని పలువురు వాదిస్తున్నారు. అయితే దీనిని కబ్జా చేసేందుకు ఆక్రమణదారులు సరిహద్దు జిమ్మిక్కులకు తెరలేపారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ భూమి పేట్ బషీరాబాద్‌ది కాదని, దీనికి ఆనుకుని ఉన్న పొరుగు గ్రామమైన కొంపల్లి రెవిన్యూ సర్వే నెంబర్‌కు చెందినదని, తమకు పట్టా కూడా ఉందంటూ సరికొత్త కథలు అల్లుతున్నట్లు సమాచారం. కానీ, వాస్తవంగా రెండు గ్రామాల ‘విలేజ్ మ్యాప్‌లను’ నిశితంగా పోల్చి చూస్తే ఆక్రమణదారుల బండారం బయటపడుతోందని స్థానికులు చెబుతున్నారు. కొంపల్లి సర్వే నెంబర్ అంటూ వారు చెబుతున్న లొకేషన్, వాస్తవ రూపానికి పూర్తిగా భిన్నంగా ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఏ రకంగా చూసినా రెండు గ్రామాల సర్వే నెంబర్ల పరిధి ఈ స్థలానికి సరిపోలడం లేదనేది స్పష్టమవుతోందని, పొరుగు గ్రామ సరిహద్దులను సాకుగా చూపి ప్రభుత్వ భూమిని నొక్కేసే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పరిశీలించి చర్యలు తీసుకుంటాం: ఆర్‌ఐ విజయ్ కుమార్
"గతంలో ఇక్కడ ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే కూల్చివేసిన ఉదంతం మా దృష్టిలో ఉంది. ప్రస్తుతం ఆ స్థలాన్ని కొంపల్లి రెవిన్యూ సర్వే నెంబర్ గా చెబుతూ దుకాణం ఏర్పాటు చేసినట్లు మాకు ప్రాథమిక సమాచారం వచ్చింది. విలేజ్ మ్యాప్ ఆధారంగా పరిశీలిస్తే ఇది తీవ్ర అనుమానాస్పదంగా ఉన్నట్లు కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో రికార్డులను, సరిహద్దులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరలోనే తదుపరి చర్యలు తీసుకుంటాం. ఈ వ్యవహారాన్ని ఉన్నతాధికారులైన ఎంఆర్‌ఓ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ భూమి రక్షణకు చట్టప్రకారం కఠిన చర్యలు చేపడతాం."
-విజయ్ కుమార్, రెవిన్యూ ఇన్స్పెక్టర్, పేట్ బషీరాబాద్






