- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిన్న బాబుకు పెద్ద కష్టం...
సూర్యాపేట మండలం బాలెంల గ్రామానికి చెందిన శివరాత్రి రామకృష్ణ, శ్రీలత దంపతుల కుమారుడు అక్షిత్ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు.

దిశ, సూర్యాపేట : సూర్యాపేట మండలం బాలెంల గ్రామానికి చెందిన శివరాత్రి రామకృష్ణ, శ్రీలత దంపతుల కుమారుడు అక్షిత్ (7) తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. రోజువారీ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఈ కుటుంబం, బాలుడి వైద్య ఖర్చులను భరించలేక దాతల సహాయం కోసం ఎదురుచూస్తోంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, ఇటీవల పాఠశాలకు సెలవు ఉండటంతో అక్షిత్ ఇంటి సమీపంలో ఇతర పిల్లలతో ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు గోడపై నుంచి కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో అతని కుడి కాలు మోకాలి భాగంలో తీవ్రంగా విరిగింది. ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉండటంతో వెంటనే మెరుగైన వైద్యం అందించలేక స్థానికంగా నాటు కట్టు వేయించారని కుటుంబ సభ్యులు తెలిపారు.
అయితే సరైన వైద్యం అందకపోవడంతో గాయం మరింత తీవ్రమై కాలులో ఇన్‌ఫెక్షన్ వ్యాపించిందని వారు చెప్పారు. అనంతరం హైదరాబాద్‌లోని పలు ఆసుపత్రులను సంప్రదించినప్పటికీ వివిధ కారణాలతో వెంటనే చికిత్స పొందలేకపోయారని తెలిపారు. చివరకు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అక్షిత్‌కు చికిత్స ప్రారంభమైంది. బాలుడికి శస్త్రచికిత్సతో పాటు దీర్ఘకాలిక వైద్య సంరక్షణ అవసరమని, ఇందుకు సుమారు రూ.5 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. రోజువారీ కూలి పనులపై ఆధారపడి జీవిస్తున్న తల్లిదండ్రులు అంత పెద్ద మొత్తాన్ని సమకూర్చలేని పరిస్థితిలో ఉన్నారు. తమ కుమారుడి చికిత్స కోసం దాతలు, సేవా సంస్థలు, ప్రజాప్రతినిధులు, మంచి మనసున్న వారు ఆర్థిక సహాయం అందించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. సహాయం చేయదలచిన వారు .. గూగుల్ పే, ఫోన్‌పే: 9515630232– శివరాత్రి రామకృష్ణ (తండ్రి), 7671979149 – మేనత్త, అక్షిత్ త్వరగా కోలుకుని సాధారణ జీవితంలోకి రావాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆకాంక్షిస్తున్నారు. దాతల సహాయం ఈ చిన్నారి జీవితంలో కొత్త ఆశలు నింపగలదని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.






