- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్ఎఫ్సీఎల్‌లో 94,849 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి
రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్) జూన్-2026 నెలలో 94,849 మెట్రిక్ టన్నుల వేపపూత (నీమ్ కోటెడ్) యూరియాను ఉత్పత్తి చేసినట్లు యూనిట్ హెడ్ ఎస్.కె జిందాల్ గురువారం తెలిపారు.

దిశ, గోదావరిఖని : రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్) జూన్-2026 నెలలో 94,849 మెట్రిక్ టన్నుల వేపపూత (నీమ్ కోటెడ్) యూరియాను ఉత్పత్తి చేసినట్లు యూనిట్ హెడ్ ఎస్.కె. జిందాల్ గురువారం తెలిపారు. జూన్ నెలలో ఉత్పత్తి చేసిన యూరియాతో పాటు మొత్తం 97,094.70 మెట్రిక్ టన్నుల యూరియాను వివిధ రాష్ట్రాలకు సరఫరా చేసినట్లు ఆయన వెల్లడించారు. తెలంగాణకు అత్యధికంగా 48,675.33 మెట్రిక్ టన్నులు, ఆంధ్రప్రదేశ్‌కు 11,308.23 మెట్రిక్ టన్నులు, కర్ణాటకకు 28,338.66 మెట్రిక్ టన్నులు, తమిళనాడుకు 5,655.60 మెట్రిక్ టన్నులు, మహారాష్ట్రకు 3,116.88 మెట్రిక్ టన్నుల యూరియాను పంపిణీ చేసినట్లు వివరించారు. ఆర్ఎఫ్సీఎల్ అనేది నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎన్ఎఫ్ఎల్), ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ (ఈఐఎల్), ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎఫ్సీఐఎల్) సంయుక్త భాగస్వామ్య సంస్థ అని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ సంస్థలో ఈక్విటీ భాగస్వామిగా ఉందన్నారు. 2021 మార్చి 22న వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించిన రామగుండం యూనిట్ ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు నాణ్యమైన వేపపూత యూరియాను సరఫరా చేస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్.కె జిందాల్ మాట్లాడుతూ.. జూన్ నెలలో ఉత్పత్తి, సరఫరా లక్ష్యాలను విజయవంతంగా సాధించడంలో కృషి చేసిన కార్మికులు, ఉద్యోగులు, అధికారులను అభినందించారు. అలాగే కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ, తెలంగాణ ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం అందించిన సహకారానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.






