9 నిమ్మకాయలు @ రూ.1.40 లక్షలు

by Muthe.Rajitha |   (  Updated:2026-04-05 00:36:02  IST  )

తమిళనాడులోని రత్నవేల్ మురుగన్ ఆలయంలో పంగుణి ఉత్తిరం ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి అలంకరించిన నిమ్మకాయలు రికార్డు ధరకు వేలం పాడబడ్డాయి.

9 నిమ్మకాయలు @ రూ.1.40 లక్షలు
X

దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడులోని విళుప్పురం జిల్లాలో ఒక అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. తిరువెన్నైనల్లూర్ సమీపంలోని ఒట్టందాల్ గ్రామంలో వెలసిన రత్నవేల్ మురుగన్ ఆలయంలో జరుగుతున్న పంగుణి ఉత్తిరం ఉత్సవాల్లో భాగంగా, స్వామివారికి అలంకరించిన నిమ్మకాయలు రికార్డు ధరలకు వేలం పాడబడ్డాయి. ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే.. ఇక్కడ విగ్రహం బదులుగా మురుగన్ ఆయుధమైన 'వేల్' అనగా శూలంను మాత్రమే ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 1 నుండి ప్రారంభమైన ఈ ఉత్సవాల్లో ప్రతిరోజూ 9 నిమ్మకాయలతో గుచ్చిన మాలను వేల్‌కు అలంకరించి, రాత్రి వేళ వాటిని భక్తులకు వేలం వేయడం ఇక్కడి ఆచారం.

ఈ ఏడాది వేలంలో మొదటి రోజు 9 నిమ్మకాయలు రూ. 45,500 పలకగా, రెండో రోజు మరో 8 నిమ్మకాయలు రూ. 15,000 కు అమ్ముడయ్యాయి. అయితే, శుక్రవారం రాత్రి జరిగిన వేలంలో భక్తుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. స్వామివారి వేల్‌కు అలంకరించిన 9 నిమ్మకాయల మాలను ఒక భక్తుడు ఏకంగా రూ. 1.43 లక్షలకు దక్కించుకున్నారు. కేవలం 9 నిమ్మకాయల కోసం ఇంత పెద్ద మొత్తాన్ని వెచ్చించడం ఈ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.

ఈ నిమ్మకాయలకు ఇంతటి డిమాండ్ ఉండటానికి కారణం భక్తుల అచంచలమైన నమ్మకం. ఈ పవిత్రమైన నిమ్మకాయలను ప్రసాదంగా స్వీకరించి తింటే, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని, వివాహం కాని వారికి త్వరగా పెళ్లి జరుగుతుందని, అలాగే వ్యాపారాల్లో లాభాలు వస్తాయని ఇక్కడి ప్రజలు బలంగా నమ్ముతారు. అందుకే, ఆర్థిక స్తోమతతో సంబంధం లేకుండా భక్తులు తమ మొక్కులు తీర్చుకోవడానికి వేలంలో భారీగా పాల్గొంటున్నారు. ఈ వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆలయ అభివృద్ధి పనులకు, ఉత్సవాల నిర్వహణకు ఉపయోగిస్తారని ఆలయ కమిటీ వారు తెలిపారు.

Next Story