మణుగూరులో 80 కేజీల గంజాయి పట్టివేత

by Jakkula.Mamatha |

కారులో తరలిస్తున్న 80 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్న సంఘటన గురువారం మణుగూరులో చోటుచేసుకుంది.

మణుగూరులో 80 కేజీల గంజాయి పట్టివేత
X

దిశ, మణుగూరు: కారులో తరలిస్తున్న 80 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్న సంఘటన గురువారం మణుగూరులో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. మణుగూరు పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. గురువారం ఉదయం గంజాయిని తరలిస్తున్నారనే సమాచారం అందడంతో పోలీసులు తొగ్గూడెం సమ్మక్క-సారలమ్మ గుడి సమీపంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో భద్రాచలం నుంచి మణుగూరు వైపు వస్తున్న ఫార్చునర్ కారును పోలీసులు ఆపి తనిఖీ చేయగా, కారులో సుమారు 80 కేజీల గంజాయి లభ్యమైంది. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.40 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

ఈ కేసులో రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన సురేంద్ర సింగ్, ధర్మేంద్ర కుమార్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి వాంగ్మూలం మేరకు కపిల్ దేవ్ అనే వ్యక్తి గంజాయి రవాణా కోసం వీరిని ఒడిశాలోని మల్కన్‌గిరి ప్రాంతానికి పిలిపించి, గంజాయి తరలిస్తే రూ.50 వేల పారితోషికం ఇస్తానని చెప్పినట్లు తెలిసింది. అక్కడి నుంచి ఫార్చునర్ కారు(నంబర్ RJ 3 UA 4386)లో గంజాయిని లోడ్ చేసి భద్రాచలం మీదుగా మణుగూరు వైపు తీసుకువస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు గంజాయితో పాటు ఫార్చునర్ కారును కూడా స్వాధీనం చేసుకుని, సురేంద్ర సింగ్, ధర్మేంద్ర కుమార్, కపిల్ దేవ్ తదితరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించిన మణుగూరు పోలీస్ స్టేషన్ సిబ్బందిని మణుగూరు డీఎస్పీ అభినందించారు.

Next Story