గిర్ అడవుల్లో 7 సింహాలు మృతి.. మరో 17 సింహాల పరిస్థితి విషమం

by Muthe.Rajitha |

గుజరాత్ లోని గిర్ అడవుల్లో వరుసగా 7 సింహాలు మృత్యువాత పడగా.. మరో 17 సింహాల పరిస్థితి విషమంగా ఉంది.

గిర్ అడవుల్లో 7 సింహాలు మృతి.. మరో 17 సింహాల పరిస్థితి విషమం
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఆసియా సింహాలకు(Asiatic Lions) ఆవాసమైన గుజరాత్‌లోని గిర్ అడవులలో (Gir Forest) భారీగా సింహాలు మృత్యువాత పడటం కలకలం రేపింది. గుజరాత్ లోని గిర్ నేషనల్ పార్కులో ప్రస్తుతం మొత్తం 891 సింహాలు జీవిస్తుండగా, ఇటీవలి రోజుల్లో వరుసగా 7 సింహాలు మరణించాయి. మరణించిన వాటిలో 4 సింహపు కూనలు(Lion Cubs) కూడా ఉండటం గమనార్హం. ఈ మరణాల వార్త వెలుగులోకి రావడంతో పర్యావరణ ప్రేమికులు, వన్యప్రాణి నిపుణులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు.

ఈ అసాధారణ మరణాలకు గల కారణాలను అన్వేషించిన అటవీ శాఖ అధికారులు ప్రాథమికంగా కొన్ని కీలక విషయాలను గుర్తించారు. మృతి చెందిన వాటిలో కొన్నిటికి 'బాబేసియా'(Babesia) అనే టిక్-బోర్న్ ఇన్ఫెక్షన్, మరికొన్నిటికి కానిన్ డిస్టెంపర్ డిసీస్(CDV) అనే అంటువ్యాధులు సోకడం వల్లనే ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నారు. అలాగే అడవిలో తమ ఆధిపత్యం కోసం సింహాల మధ్య జరిగే ప్రాంతీయ ఘర్షణల (Territorial fights) వల్ల ఓ సింహం మరణించిందని తెలిపారు. అంతేకాదు మరో 17 సింహాలు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. వీటి పరిస్థితి కాస్త సీరియస్‌గా ఉండటంతో అటవీ శాఖ అధికారులు ఆ 17 సింహాలను వెంటనే ఐసోలేషన్‌కు తరలించి, ప్రత్యేక వైద్య బృందాల పర్యవేక్షణలో ఇంటెన్సివ్ కేర్ చికిత్స అందిస్తున్నారు. ఇన్ఫెక్షన్లు మరికొన్ని సింహాలకు వ్యాపించకుండా ఉండేందుకు క్షేత్రస్థాయిలో కఠినమైన నిఘా చర్యలు చేపట్టారు.

ఈ అసాధారణ పరిస్థితులపై గుజరాత్ అటవీ శాఖ మంత్రి అర్జున్ మోఢ్‌వాడియా స్పందిస్తూ.. సింహాల మరణాలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. గిర్ అడవుల్లో సంభవిస్తున్న ఈ మరణాల వెనుక ఎలాంటి ప్రమాదకరమైన 'వైరల్ అవుట్‌బ్రేక్' లేదని అన్నారు. ప్రస్తుతం అటవీ ప్రాంతంలో పరిస్థితి పూర్తిగా నియంత్రణలోనే ఉందని, అనారోగ్యంతో ఉన్న సింహాలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ అటవీ శాఖ అత్యంత జాగ్రత్తగా పర్యవేక్షిస్తోందని మంత్రి భరోసా ఇచ్చారు.

Next Story