Hydraa: గ్రామ‌పంచాయ‌తీ లే ఔట్ నుంచి హుడా లే ఔట్ వ‌ర‌కూ ఒకే ప‌రిస్థితి

by Gantepaka Srikanth |

లే ఔట్ వేసిన‌ప్పుడు పార్కులుగా చూపించారు.

Hydraa: గ్రామ‌పంచాయ‌తీ లే ఔట్ నుంచి హుడా లే ఔట్ వ‌ర‌కూ ఒకే ప‌రిస్థితి
X

దిశ, తెలంగాణ బ్యూరో: లే ఔట్ వేసిన‌ప్పుడు పార్కులుగా చూపించారు. త‌ర్వాత అవి ప్లాట్లుగా మార్చేసి లే ఔట్ వేసిన వారితో పాటు.. కాల‌నీ సంక్షేమ సంఘాల వారు అమ్ముకుంటున్నార‌ని ప‌లువురు హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. గ్రామ‌పంచాయ‌తీ లే ఔట్ నుంచి హుడా లే ఔట్ వ‌ర‌కూ ఇదే ప‌రిస్థితి నెల‌కొంద‌ని వాపోయారు. పార్కులుగా పేర్కొంటూ ఆయా గ్రామ‌పంచాయ‌తీల‌కు, మున్సిపాలిటీల‌కు, కార్పొరేష‌న్ల‌కు గిఫ్ట్ డీడ్‌లు రాసిచ్చిన త‌ర్వాత కూడా పార్కు స్థ‌లాలు ప్లాట్లుగా మారిన‌ట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాలు, ర‌హ‌దారులను కూడా వ‌ద‌ల‌కుండా క‌బ్జాలు చేస్తున్నారంటూ ప‌లువురు ఫిర్యాదు చేస్తున్నారు. గ‌తంలో 7 కాల‌నీల‌కు దారి చూపుతూ ఆక్ర‌మ‌ణ‌ల‌తో పాటు ప్ర‌హ‌రీల‌ను హైడ్రా తొల‌గించినా ప్ర‌యోజ‌నం లేక‌పోయింద‌ని తుర్క‌యాంజ‌ల్ మున్సిపాలిటీ 24వ వార్డు నివాసితులు ఫిర్యాదు చేశారు. అక్క‌డ రోడ్డు వేయ‌డానికి ఆక్మ‌ణ‌దారులు అడ్డు చెబుతున్నార‌ని.. స్థానిక అధికారులు చొర‌వ చూప‌డంలేద‌ని ..వెంట‌నే రోడ్డు వేయాల‌ని కోరారు. ఇలా సోమ‌వారం హైడ్రా ప్ర‌జావాణికి వ‌చ్చిన 65 ఫిర్యాదుల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ.రంగ‌నాథ్ నేరుగా ప‌రిశీలించి.. ఫిర్యాదు దారుల ముందే సంబంధిత అధికారుల‌కు ప‌రిష్కార బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు.

ఫిర్యాదులు ఇలా..

-రంగారెడ్డి జిల్లా బాగ్ హ‌య‌త్‌న‌గ‌ర్ స‌ర్వే నంబ‌రు 97లో శ్రీ రాంన‌గ‌ర్ కాల‌నీలో 300ల గ‌జాల విస్తీర్ణంలో ఉన్న రెండు పార్కులు క‌బ్జాకు గురౌతున్నాయ‌ని కాల‌నీ ప్ర‌తినిధులు హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. పార్కుల కోసం కేటాయించిన స్థ‌లాల‌ను ప్లాట్లుగా మార్చేసి అమ్ముకుంటున్నార‌ని.. ఇలా ఈ కాల‌నీలో నాలుగు చోట్ల క‌బ్జాలు జరుగుతున్నాయ‌ని.. వెంట‌నే పార్కుల‌ను కాపాడేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని హైడ్రా ప్ర‌జావాణిలో కోరారు. ఇదే జిల్లాలోని స‌రూర్‌న‌గ‌ర్ మండ‌లం, చంపాపేట్ విలేజ్‌లోని దుర్గాభ‌వానీ న‌గ‌ర్‌లో361 గ‌జాల పార్కు ఇంటి స్థ‌లంగా మారిపోయింద‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు.

- మేడ్చల్ - మ‌ల్కాజిగిరి జిల్లా, కుత్బుల్లాపూర్ మండలం, సుభాష్ నగర్ పరిధిలోని భాగ్యలక్ష్మి కాలనీలో పార్కు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాలు ఆక్రమణలు జరుగుతున్నాయని కాలనీ వాసులు హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదు చేశారు. కాలనీలో ప్లాట్ నంబర్లు 317–318, 284–285, 265–266, 259–260, 320 సమీపం లోని పార్కుల‌తో పాటు.. 336–337 మధ్య ఉన్న మొత్తం 6 పార్కులు, ఓపెన్ ప్లేస్‌లు ఆక్రమణలకు గురవుతున్నాయని వారు తెలిపారు. గతంలో జీహెచ్ఎంసీ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి వర్క్ ఆర్డర్ ఇచ్చినప్పటికీ, రాజకీయ జోక్యంతో పనులు ఆగిపోయాయని కాలనీ వాసులు వాపోయారు.

-మ‌హేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గం బ‌డంగ్ పేట స‌ర్కిల్ ఆల్మాస్‌గూడ 57వ డివిజ‌న్ శ్రీ హిల్స్ కాల‌నీ ఫేజ్ 2లో 1983లో 460 ప్లాట్ల‌తో లే ఔట్ వేశారు. ఇందులో 2260 గ‌జాల స్థ‌లాన్ని పార్కుకు కేటాయించారు. ఈ పార్కులో ఇప్ప‌టికే 6 ఇళ్లు వ‌చ్చేయ‌గా మిగిలిన స్థ‌లాన్ని అయినా కాపాడాల‌ని హైడ్రా ప్ర‌జావాణిలో అక్క‌డి నివాసితులు ఫిర్యాదు చేశారు.

-మేడ్చ‌ల్ - మ‌ల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండ‌లం మ‌చ్చ‌బొల్లారంలోని విజ‌య‌విహార్ ఎన్‌క్లేవ్ లే ఔట్‌లో ర‌హ‌దారుల‌తో పాటు.. వ‌ర‌ద కాలువ నిర్మాణానికి 20 ఫీట్ల మేర ఖాళీ స్థ‌లాన్ని ఉంచితే.. ప‌క్క‌నే ఉన్న భూ య‌జ‌మానులు ఆ 20 ఫీట్ల ర‌హ‌దారిని క‌బ్జా చేసేశారు. మా లే ఔట్ ప్ర‌కారం ఖాళీ స్థ‌లాన్ని త‌మ‌కు అంద‌జేయాల‌ని హైడ్రా ప్ర‌జావాణిలో నివాసితులు ఫిర్యాదు చేశారు.

-మేడ్చ‌ల్ - మ‌ల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండ‌లం మ‌చ్చ‌బొల్లారంలో 432 ప్లాట్ల‌తో శ్రీ సాయి రెడ్డీ లేఔట్‌ను వేశారు. ఈ లే ఔట్‌కు చేరువలో మూత్కుల్ కుంట ఉంది. అలుగుమీద అక్ర‌మ‌క‌ట్ట‌డాలు రావ‌డంతో చెరువులోని నీరు బ‌య‌ట‌కు వెళ్ల‌డానికి వీలు లేని ప‌రిస్థితి. ఈ లే ఔట్‌లో 90 ప్లాట్ల వ‌ర‌కూ నీట మునుగుతున్నాయి. గ‌తంలో ఈ చెరువు 5.22 ఎక‌రాలుగా ఉండేది. మురుగు నీరు కూడా చేర‌డం.. చెరువు నుంచి కింద‌కు నీరు వెళ్లే అలుగు ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురి కావ‌డంతో నీటి నిలువ‌లు పెరుగుతున్నాయ‌ని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు.

-రంగారెడ్డి జిల్లా బండ్ల‌గూడ జాగీర్ గందంగూడలోని గ్రీన్ పార్క్స్ కాల‌నీలో హైద‌ర్షాకోట్ - బైరాగి గూడ ప్ర‌ధాన ర‌హ‌దారి 30 ఫీట్లుండ‌గా.. ప‌క్క‌నే స్థ‌లం ఉన్న వారు మొత్తం 12 అడుగులకు పైగా ఆక్ర‌మించేయ‌డంతో ఆ రోడ్డు కుంచించుకుపోయింద‌ని.. దీంతో త‌మ‌కు దారి లేకుండా పోయింద‌ని హైడ్రా ప్ర‌జావాణిలో గ్రీన్ పార్క్స్ కాల‌నీ ప్ర‌తినిధులు ఫిర్యాదు చేశారు.

-మ‌ణికొండ‌లోని స‌చివాల‌య ఉద్యోగుల కాల‌నీ లేఔట్‌లో పార్కులు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాలు క‌బ్జాకు గుర‌య్యాయ‌ని వైఎస్ ఆర్ సెక్ర‌టేరియ‌ట్ ఎంప్లాయీస్ కాల‌నీ ప్ర‌తినిధులు హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. 2236 గ‌జాల స్థ‌లంతో పాటు.. 1163 గ‌జాల స్థ‌లం క‌బ్జాల‌కు గురి కాకుండా కాపాడాల‌ని కోరారు. అలాగే ఇక్క‌డ వ‌క్ఫ్ ల్యాండ్‌గా పేర్కొంటున్న భూములు కూడా క‌బ్జాల‌కు గురి అవుతున్నాయ‌న్నారు. గ‌తంలో తాము ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు వెంక‌టేశ్వ‌ర న‌గ‌ర్ - వైఎస్ ఆర్‌కాల‌నీల‌ను క‌లుపుతూ 60 ఫీట్ల ర‌హ‌దారిని అందుబాటులోకి తెచ్చిన హైడ్రాకు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

Next Story