- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కీవ్ సూపర్ మార్కెట్లో కాల్పులు.. ఆరుగురు మృతి
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఒక దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆరుగురు పౌరులు ప్రాణాలు కోల్పోగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.

దిశ, వెబ్ డెస్క్ : రష్యాతో యుద్ధంతో అల్లాడుతున్న ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో మరో ఘోర ఘటన చోటుచేసుకుంది. ఒక దుండగుడు జరిపిన విచక్షణారహిత కాల్పుల్లో ఆరుగురు సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక నివాస సముదాయం వద్ద మొదలైన ఈ హింసాకాండ, ఆపై ఒక సూపర్ మార్కెట్‌లో బందీల డ్రామాకు దారితీయడంతో కీవ్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
అసలేం జరిగిందంటే..?
అధికారుల సమాచారం ప్రకారం.. ఒక సాయుధ వ్యక్తి తొలుత ఒక నివాస సముదాయంలోకి చొరబడి అక్కడున్న వారిపై కాల్పులకు తెగబడ్డాడు. ఆ తర్వాత హడావిడిగా సమీపంలోని ఒక సూపర్ మార్కెట్‌లోకి ప్రవేశించి, అక్కడ ఉన్న కస్టమర్లను, సిబ్బందిని బందీలుగా చేసుకున్నాడు. సమాచారం అందుకున్న వెంటనే ఉక్రెయిన్ ప్రత్యేక భద్రతా దళాలు, పోలీసులు రంగంలోకి దిగారు. దుండగుడిని లొంగిపోవాలని కోరినప్పటికీ, అతను ఎదురుకాల్పులకు దిగడంతో భద్రతా దళాలు అతనిపై కాల్పులు జరిపి హతమార్చాయి. ఈ ఆపరేషన్ ముగిసే సమయానికి ఆరుగురు పౌరులు మరణించారని అధికారులు ధ్రువీకరించారు.
అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పందన
ఈ విషాదకర ఘటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాడిమిర్ జెలెన్‌స్కీ తీవ్రంగా స్పందించారు. "నిరపరాధులైన పౌరులపై జరిగిన ఈ దాడి అత్యంత దారుణం. ఆరుగురు పౌరులు ప్రాణాలు కోల్పోవడం దేశానికి తీరని లోటు. భద్రతా దళాలు సకాలంలో స్పందించి దుండగుడిని హతమార్చాయి" అని ఆయన వెల్లడించారు. గాయపడిన 10 మందికి మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. కాగా ఈ ఘటన వెనుక ఉన్న కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇది ఉగ్రవాద చర్యనా లేక వ్యక్తిగత విద్వేషమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






