నిర్ణీత గడువులోపే 5జీ వేలం!

by Disha Web |
నిర్ణీత గడువులోపే 5జీ వేలం!
X

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 5జీ స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియ షెడ్యూల్ ప్రకారమే, నిర్ణీత గడువులోగా నిర్వహించబడుతుందని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం ఓ ప్రకటనలో అన్నారు. టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ స్పెక్ట్రమ్ ధర, ఇతర అంశాలపై 5జీ సిఫార్సులు గత నెల చివరి నాటికి రానున్నట్టు వచ్చిన అంచనాల మధ్య ఆయన షెడ్యూల్ ప్రకారమే 5జీ వేలం జరుగుతుందని స్పష్టం చేశారు. సోమవారం సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అండ్ డిజిటల్ ఫోరేన్సిక్ 2వ జాతీయ సదస్సులో పాల్గొన్న సందర్భంగా అశ్విని వైష్ణవ్ విలేకరులతో మాట్లాడారు.

ప్రైవేట్ టెలికాం కంపెనీల నుంచి 2022-23లోగా 5జీ మొబైల్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు గాను ఈ ఏడాదిలోపు స్పెక్ట్రమ్ వేలం జరగాల్సి ఉంది. 5జీ వేలం, సంబంధిత అంశాలపై ట్రాయ్ సూచనలు, అభిప్రాయాలు కీలకమైనవి. మరో పది రోజుల్లోగా 5జీ స్పెక్ట్రమ్ ధర, ఇతర అంశాలపై సిఫార్సులు వెలువడతాయని గత నెల ట్రాయ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గతేడాది నవంబర్‌లో ట్రాయ్ 5జీ స్పెక్ట్రమ్ విలువ, రిజర్వ్ ధర, వేలంలో పాల్గొనేందుకు అవసరమైన అర్హతలు సహా ఇతర అంశాలతో కూడిన సమగ్రమైన సంప్రదింపుల పత్రాలను విడుదల చేసింది. కాగా, టెలికాం సేవల ప్రొవైడర్లు ఇప్పటికే ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు సహా పలు నగరాల్లోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 5జీ పరీక్షలు నిర్వహిస్తున్నారు.


Next Story

Most Viewed