రైతులు యాంత్రీకరణ పథకంలో చేర్చితే 40 శాతం సబ్సిడీ: మంత్రి తుమ్మల

by Malleboina Mahesh |

వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద రైతులకు 40% సబ్సిడీతో ఆధునిక యంత్రాలు.. మాదాపూర్ ఎర్త్‌కాన్ ఎక్స్‌పోలో మంత్రి తుమ్మల వెల్లడి!

రైతులు యాంత్రీకరణ పథకంలో చేర్చితే 40 శాతం సబ్సిడీ: మంత్రి తుమ్మల
X

దిశ, తెలంగాణ బ్యూరో : వ్యవసాయ శాఖ అమలు చేస్తున్న వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో చేర్చిన రైతులకు 40 శాతం సబ్సిడీతో పరికరాలు పంపిణీ చేసే అవకాశం ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. ప్రస్తుతం డీజిల్‌తో నడుస్తున్న ఈ యంత్రాలకు ప్రత్యామ్నాయంగా బ్యాటరీతో పనిచేసే నమూనాలను కూడా మార్కెట్‌లోకి తీసుకురావాలని సంస్థ యాజమాన్యానికి సూచించారు. బ్యాటరీ ఆధారిత యంత్రాలు కనీసం 6 నుంచి 7 గంటల పాటు నిరంతరయంగా పనిచేసే విధంగా రూపకల్పన చేయాలని కోరగా, త్వరలోనే అలాంటి యంత్రాలను అందుబాటులోకి తీసుకువస్తామని సంస్థ ప్రతినిధులు చెప్పారు. ఆధునిక వ్యవసాయంలో యాంత్రీకరణకు అత్యంత ప్రాధాన్యత ఉందన్నారు.

శుక్రవారం మాదాపూర్ లో నిర్వహించిన ఎర్త్‌కాన్ ఎక్స్‌పో ఎగ్జిబిషన్‌లో ఎక్స్‌సీఏ సంస్థ ఏర్పాటు చేసిన స్టాల్ ను సందర్శించి లోడర్, ఎక్సవేటర్ యంత్రాల పనితీరును ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఈ యంత్రాలు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, వ్యవసాయ రంగంలో కూలీల కొరత తీవ్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి యంత్రాలు రైతులకు పెద్ద ఎత్తున సహకరిస్తాయన్నారు. తక్కువ సమయంలో వ్యవసాయ పనులను పూర్తి చేసుకునేందుకు తోడ్పడతాయని తెలిపారు. రైతులకు పొలంలో సులభంగా ఉపయోగపడే పోర్టబుల్ యంత్రాలను తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకువచ్చిన ఎక్స్‌సీఏ సంస్థను అభినందించారు.

వ్యవసాయ రంగ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ తరహా వినూత్న యంత్రాలకు మార్కెట్లో మంచి ఆదరణ లభించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని 1.5 టన్నుల సామర్థ్యం గల మినీ హైడ్రాలిక్ ఎక్సవేటర్ ఈవీ మోడల్‌ను 2027 నాటికి మార్కెట్‌లోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టాలని సూచించారు. వినియోగదారుల కోసం ప్రత్యేక డెమో జోన్ ఏర్పాటు చేయడంతో పాటు, ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

Next Story